Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు

jayyapal jvs media
1 minute read


 రంగారెడ్డి, ఏప్రిల్ 14: జిల్లాలోని దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. కారులో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు (Childrens Death) మృత్యువాత పడ్డారు. తనయ శ్రీ, అభినయ శ్రీ ఆడుకుంటూ ఇంటి ముందు పార్క్ చేసిన కారులోకి వెళ్లారు. వీరు కారులోకి వెళ్లిన వెంటనే డోర్ లాక్ అవడంతో ఊపిరాడక అల్లాడిపోయారు. ఆ తరువాత కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు చిన్నారులు. తనయ శ్రీ, అభినయ శ్రీ అనే ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. పెద్ద వాళ్లంతా ఇంట్లో ఉండగా చిన్నారులు ఆడుకుంటూ బయటకు వచ్చారు. తాము కారులో ఆడుకుంటామని పెద్దవాళ్లకు చెప్పారు చిన్నారులు. ఇందుకు వాళ్లు ఓకే చెప్పారు కూడా. దీంతో ఇంటి ఎదురుగా ఉన్న కారులోకి వెళ్లి ఆటల్లో మునిగిపోయారు. కానీ చిన్నారులు కారులోకి వెళ్లిన వెంటనే కారు డోర్ లాక్ అయ్యింది. కొద్దిసేపు ఆడిన చిన్నారులు కారు మొత్తం లాక్ పడిపోవడంతో ఊపరి ఆడక అవస్థలు పడ్డారు. కార్ డోర్ తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అది రాలేదు. పెద్దవాళ్లను పిలిచేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ వీరి మాటలు బయటకు వినిపించలేదు. దీంతో కాసేపు కారులో ఊపిరి అందక ఇబ్బంది పడిన చిన్నారులు ఆ తరువాత ప్రాణాలు విడిచారు. అయితే చిన్నారులు కారులో వెళ్లి ఆడుకుంటున్న విషయాన్ని పెద్దలు మరిచిపోయారు. కాసేపటి చిన్నారులు ఇంకా రాలేదని వారు వెళ్లి కారులో చూడగా అప్పటికే ఇద్దరు చిన్నారులు కూడా కారులో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే వారిని హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ ఇద్దరు చిన్నారులు శ్వాస తీసుకోలేక ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు. ఇద్దరు చిన్నారులు ఒకేసారి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా.. అమ్మమ్మ ఇంటికి వచ్చి ఆడుకుంటూ చిన్నారులు ఇలా కారులో ఊపిరాడక చనిపోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Tags
Chat