SLBC సొరంగం పనులపై నిపుణుల కమిటీ సమావేశం - టన్నెల్‌లోని చివరి 50 మీటర్లలో సహాయక చర్యలపై చర్చ - సహాయక చర్యలకు డ్రిల్ అండ్ బ్లాస్ట్ విధానం తప్ప మరో మార్గంలేదన్న నిపుణులు
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం డేంజర్ జోన్లో సహాయక చర్యలు, భవిష్యత్ పనులకు డ్రిల్ అండ్ బ్లాస్ట్ విధానం (డీబీఎం) తప్ప ఇంకో మార్గం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. డేంజర్ జోన్లో సహాయక చర్యలకు అనుసరించాల్సిన విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తొలి సమావేశం గురువారం జరిగింది. హైదరాబాద్ జల సౌధలో జరిగిన కమిటీ సమావేశంలో సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.చివరి 50 మీటర్ల డేంజర్ జోన్లో సహాయక చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఆ ప్రాంతంలో ఉన్న రాతి పొరలు, ఇతరత్రాల దృష్ట్యా మళ్లీ కుప్పకూలే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో సహాయక చర్యలు సహా భవిష్యత్ పనుల కోసం ఇన్‌లెట్ ప్రాంతం నుంచి సంప్రదాయ డ్రిల్ అండ్ బ్లాస్ట్ విధానం తప్ప ఇంకో మార్గం లేదని నిపుణులందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు పర్యావరణ నిబంధనలు పరిశీలించి సిఫారసు చేసేందుకు మరో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
ఇక నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ కాకుండా ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి కాలరీస్, రైల్వే సిబ్బంది సహాయంతో రాళ్లు, వ్యర్థాల తొలగింపు చర్యలు కొనసాగించాలని నిర్ణయించారు. డేంజర్ జోన్లో మిగిలిపోయిన ఆరుగురి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం.
ప్రత్యామ్నాయాలపై దృష్టి : ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఎస్‌ఎల్‌బీసీ సొరంగం (ఇన్‌లెట్) పైకప్పు కూలిన విషయం తెలిసిందే. ప్రమాదంలో 8 మంది చిక్కుకుపోగా, ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలో సొరంగం నిర్మాణంతో పాటు భవిష్యత్ ప్రణాళికలు, రక్షణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణుల కమిటీ తిరిగి ఒక సాంకేతిక ఉప కమిటీని ఏర్పాటు చేసింది. పలు జాతీయ సంస్థలతో పాటు కర్నల్ పరీక్షిత్ మెహ్రాకు ఇందులో స్థానం కల్పించారు. ప్రస్తుత ప్రమాదం నేపథ్యంలో తవ్వకాలకు ప్రత్యామ్నాయ చర్యలపై సూచనలు అందజేసే బాధ్యతను దీనికి అప్పగించారు. ఉపరితలం నుంచి సొరంగం చివరి ప్రాంతానికి ఒక షాఫ్ట్ (మార్గం) నిర్మించాలంటే అమ్రాబాద్ రక్షిత పులుల అభయారణ్యానికి సంబంధించి కేంద్రం అనుమతులు పొందాల్సి ఉంది. లేదా సొరంగం లోపల డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వకాలు చేపట్టి ఇప్పుడున్న మార్గం నుంచే 14 కి.మీ. వెనక్కు మట్టి, రాళ్లను తరలించాలి. అయితే, దీనికి ముందు భూమి పొరల తీరును అంచనా వేయడానికి బోర్ రంధ్రాలు వేయాలన్న అభిప్రాయం ఉంది. దీనికి కూడా కేంద్రం అనుమతులు తప్పనిసరి. లేదంటే భూమి పొరల తీరును స్కానింగ్ చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో వీటిలో ఏది మేలన్నదానిపై ఉప కమిటీ నివేదిక అందజేయనుంది.