Pahalgam Terror Attack: ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. నవ వధువు కళ్ళ ఎదుటే ఉగ్రదాడిలో మృతి..
మంచు దుప్పటి కప్పుకుని అందమైన ప్రకృతితో భూతల స్వర్గం అయిన కశ్మీర్ లో సరదాగా కొన్ని రోజులు గడపాలని వెళ్ళిన పర్యాటకులు తెలియదు.. తాము ఉగ్రమూకల దాడికి బలవుతామని.. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇప్పటి వరకూ 30 మంది మృతి చెందారు. ఆ మృతుల్లో హర్యానాకి చెందిన ఒక నేవీ అధికారి కూడా ఉన్నారు. అతనికి వివాహం జరిగి కేవలం ఐదు రోజులు అయినట్లు తెలుస్తోంది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 30 మంది మరణించారు. అనేకమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ మృతుల్లో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 26 ఏళ్ల భారత నావికాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. వినయ్ నర్వాల్ వివాహం జరిగి కేవలం ఐదు రోజులు మాత్రమే అయినట్లు తెలుస్తోంది. వివాహం కోసం సెలవులో ఉన్న వినయ్ తన భార్యతో కలిసి కాశ్మీర్‌లోని అందాలను చూస్తూ నవ జీవితాన్ని గడపడానికి వెళ్ళాడు.
26ఏళ్ల వినయ్ నార్వాల్ రెండేళ్ల క్రితమే నేవీలో చేరారు. కొచ్చిలో పోస్టింగ్ తీసుకున్న వినయ్ అక్కడే తన ఉద్యోగ విధులను నిర్వహిస్తున్నారు. వినయ్ ఏప్రిల్ 16నుంచి వివాహం కోసం.. సెలవులో ఉన్నట్లు రక్షణ అధికారులు ధృవీకరించారు. వినయ్ పెళ్లి, వివాహ రిసెప్షన్ ఏప్రిల్ 19న జరిగింది.
కాళ్ళ పారాణి అయినా అరక ముందే వినయ్ ఉగ్రదాడిలో మరణించడం ఆయన కుటుంబ సభ్యులను, రక్షణ వ్యవస్థతో పాటు యావత్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వినయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇరుగు పొరుగువారు, స్థానికులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చాలామంది వినయ్ నార్వాల్ ను ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ అధికారిగా అభివర్ణించారు.