కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం..మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి


 కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించాలని నిర్ణయించడం ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిర్ణయం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దీర్ఘకాలిక దృష్టికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ విజయంగా అభివర్ణించారు.

కులగణనలో ముందడుగు

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా కులగణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించింది. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కులగణన ద్వారా రాష్ట్రంలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారనే విషయం స్పష్టంగా తేలింది. ఈ డేటా ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచింది.

రాహుల్ గాంధీ విజన్

రాహుల్ గాంధీ గత కొన్నేళ్లుగా కులగణన కోసం నిరంతరం పోరాటం చేశారు. విపక్ష నేతగా ఉన్నప్పటికీ, ఆయన దేశ విధానాలను ప్రభావితం చేయగలిగారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన కోసం ఉద్యమాలు చేపట్టింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దిల్లీలో ఆందోళనలు నిర్వహించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ పోరాటాల ఫలితంగా, కేంద్రం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడికి లొంగిపోయి కులగణన నిర్వహించేందుకు సిద్ధమైందన్నారు.


దిగొచ్చిన బీజేపీ

తెలంగాణలో కాంగ్రెస్ నిర్వహించిన కులగణనను ఇంతకాలం బీజేపీ అపహాస్యం చేసింది. అయితే, ఇప్పుడు కేంద్రం కులగణన నిర్వహించాలని నిర్ణయించడం బీజేపీ తెలంగాణ దారిలోనే నడుస్తోందనడానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు, తెలంగాణలో ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ మోడల్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన శాస్త్రీయమైనదన్నారు. ఈ గణన ఆధారంగా రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పేందుకు అనేక కీలక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ చేసిన పనిని దేశం అనుసరిస్తోందని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ఈ కులగణన ద్వారా రాష్ట్రంలోని వివిధ కులాల జనాభా నిష్పత్తిని ఖచ్చితంగా తెలుసుకోవడం సాధ్యమైంది. దీని ఆధారంగా సమర్థవంతమైన విధానాలు రూపొందించబడ్డాయని వెల్లడించారు.

Previous Post Next Post

نموذج الاتصال