గొల్లపల్లి గ్రామ శివారులో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే… జడ్చర్ల మండలం పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన నవీన్ (26) మరియు యాదగిరి (25) ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు మొదట పరిచయస్తుల ఇళ్లలో వెతికినా వారి సమాచారం లభించకపోవడంతో ఆందోళన చెందారు. అనంతరం గల్లంతైన విషయం గ్రామస్థులకు తెలిసి కలకలం రేగింది.
మృతుల్లో నవీన్ తండ్రి మాసయ్య, . కుటుంబానికి ఆసరాగా నిలవాలని ఆశించిన నవీన్ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే యాదగిరి తండ్రి వెంకటయ్య. ఇతను కూడా పెయింటింగ్ వృత్తినే ఆధారంగా పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరూ దళిత కుటుంబాలకు చెందినవారిగా గ్రామంలో గుర్తింపు పొందిన వారు. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోస్తూ జీవనం సాగిస్తున్న ఈ యువకుల గల్లంతు గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది.
గ్రామ శివారులో గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా నల్లమట్టి, మొరం తవ్వకాల కారణంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల ఆ గుంతల్లో నీరు నిలిచిపోయింది. ఆ ప్రాంతం గుండా వెళ్లే సమయంలో యువకులు కాలుజారి నీటిలో పడిపోయారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గల్లంతైన యువకుల కోసం ఫైర్ సిబ్బంది, గ్రామస్థులు కలిసి గుంతల్లో మృతదేహాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలు లభించిన తరువాత పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం గొల్లపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.