పాలమూరులో హైటెక్ వ్యభిచారం


40 ఇళ్లు.. 20 మంది సహాయకులు.. కోడింగ్ భాషలో రూ.కోట్లలో వ్యాపారం. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్న మాఫియా. పోలీసుల దాడులతో జిల్లా కేంద్రంలో జోరుగా చర్చ

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వ్యభిచార సామ్రాజ్యం విస్తరించింది. జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ ప్రాంతంలో పోలీసుల దాడులతో ఏడుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు దొరకడం సంచలనంగా మారింది. రద్దీ ప్రాంతాలు, నివాస గృహాలు అధికంగా ఉండే ప్రాంతాలను కూడా తమ అడ్డాలుగా మార్చుకుని, వేలాది మంది విటులతో ఒక వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు సమాచారం.

మూడంచెల భద్రత.. కోడింగ్ భాష!

నిర్వాహకుడు తన చుట్టూ 20 మంది అనుచరులతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడని తెలుస్తోంది. అనుమానం రాకుండా తరచుగా అద్దె ఇళ్లను మారుస్తూ (సుమారు 40 ఇళ్లు) ఈ దందాను గుట్టుగా నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా మహిళల ఫొటోలు పంపిస్తూ, కోడింగ్ భాషలో వ్యవహారాలు నడిపించడం గమనార్హం. జిల్లా పరిధిలో సుమారు రెండువేల మందికి పైగా కాంటాక్ట్స్‌తో ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఇటీవల పట్టుబడిన వ్యక్తి బెయిల్ తీసుకుని మళ్లీ దందా ప్రారంభించినట్లు సమాచారం.

వైఫల్యమా? పరోక్ష సహకారమా?

బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ, ఇంత పెద్ద స్థాయిలో దందా కొనసాగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రజలు నివసించే కాలనీల్లో ఇలాంటి కార్యకలాపాలు జరగడం వల్ల యువతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు అనే చర్చ జిల్లా కేంద్రంలో కొనసాగుతోంది.

పోలీసుల కళ్లుగప్పి..

గత ఆరు సంవత్సరాలుగా ఈ వ్యవహారం పోలీసుల కళ్లుగప్పి సాగుతుండటం విమర్శలకు దారి తీసింది. చిన్న సంఘటనలు వెంటనే గుర్తించే పోలీసులు, ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న హైటెక్ వ్యవహారాన్ని గుర్తించలేకపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ చీకటి సామ్రాజ్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow