.. ఎల్లిపాయలకు ఎగబడ్డ జనం!
సాధారణంగా మన ముందు ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేస్తాం.. వెంటనే వాళ్లను రక్షించడమో, లేదా అంబులెన్స్‌కో, పోలీసులకో సమాచారం ఇస్తాం. కానీ ఇక్కడ కొందరు జనాలు మాత్రం.. మానవత్వాన్ని మర్చిపోయారు. ప్రమాదానికి గురైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని వదిలేసి.. పక్కనే పడిన ఎల్లిపాయలను ఎత్తుకెళ్లడంతో బిజీ అయ్యారు. ఇంతకూ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
జనాల్లో రోజురోజుకూ మానవత్వం చచ్చిపోతుంది.. ఓ పక్క మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పట్టించుకోకుండా, తమ స్వార్థం కోసం ఆలోచించే మనుషులు ఎక్కువై పోయారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. కంది మండలం మామిడిపల్లి వద్ద జాతీయ రహదారి 161 ఫ్లై ఓవర్‌పై ఓ లారీ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్ర మబ్బులో ఉండడంతో నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను బలంగా డీకొట్టిన లారీ పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్రంగా గాయపడి.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
అయితే ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ ప్రాణపాయ స్థితిలో పడిఉన్న డ్రైవర్‌ను కాపాడటం పక్కన పెట్టి, లారీలోని వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లడానికి స్థానికులు పోటీ పడ్డారు. అయితే అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులకు స్పందించి గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించిన తర్వాత ఘటనా స్థలంలో అసలు సీన్ మొదలైంది. లారీ వద్ద ఎవరూ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న స్థానికులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. లారీలో ఉన్నది ఖరీదైన ఎల్లిపాయల లోడ్ కావడంతో.. రోడ్డు పై పడ్డ సంచులను ఎత్తుకెళ్లడానికి పోటీ పడ్డారు. మరికొంతమంది అయితే లారీ పైకి ఎక్కి మరీ వెల్లుల్లి సంచులను కిందకు పడేస్తూ దొరికిన కాడికి దోచుకెళ్లారు.బైక్‌లు, ఆటోలపై, సంచులను పెట్టుకుని ఇళ్లకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టారు. క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించి జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఒక మనిషి ప్రమాదంలో ఉంటే సహాయం చేయాల్సింది పోయి ఇలా ఎల్లిపాయ సంచులు ఎత్తుకెళ్లిన విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.