# జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయండి: జడ్చర్ల ప్రజలకు నిర్వాహకుల పిలుపు


జడ్చర్ల, జూలై 14: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్ పాలమూరు ) ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ శనివారం జడ్చర్ల పట్టణంలో నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని జగన్నాథ రథయాత్ర కమిటీ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు రథయాత్ర విశేషాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రథయాత్ర వైభవంగా కొనసాగనుంది. కావేరమ్మపేటలోని చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రారంభమయ్యి రథయాత్ర వెంకటేశ్వరస్వామి ఆలయం మీదుగా సిగ్నల్ గడ్డ, నేతాజీ చౌరస్తా, గంజి, రెండో గేటు, యూనియన్ బ్యాంకు మీదుగా రామ మందిర్ ** వరకు సాగనుంది. రథయాత్ర అనంతరం స్వామివారికి విశిష్ట పూజలు, జగన్నాథుడి చరిత్రపై ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 56 రకాల వంటకాలతో స్వామివారికి మహా నైవేద్యం సమర్పించనున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరంలో పరిమిత స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని, ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. జగన్నాథుడి ఆశీస్సులు ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యాన్ని కోరారు. జగన్నాథుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు కష్టాలు, నష్టాలు, ఆటంకాలు తొలగుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉందని పేర్కొన్నారు. అందువల్ల జడ్చర్ల పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల భక్తులు కుటుంబ సమేతంగా రథయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగన్నాథ రథయాత్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. వరద రాజ్ దాస్ ప్రభుజీ, కొండప్ప, కమిటీ సభ్యులు లావణ్య, సునీత, వాసవి, చంద్రయ్య, విశ్వేశ్వర్ మంచన గణేష్, లవకుమార్,రామకృష్ణ పాల్గొన్నారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow