Hyderabad: నమ్మి అప్పగించిన పేదోడి కష్టార్జితం మాయం.. సహకార బ్యాంకులో రూ.12 కోట్లు గాయబ్..!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న గోల్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) బ్యాంకులో రూ.12 కోట్ల మేర అక్రమాల ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. బ్యాంకు మాజీ సీఈవో బల్లమోని యాదయ్య, క్లర్క్ సురేందర్ యాదవ్ కుమ్మక్కై డిపాజిటర్ల నిధులను అక్రమంగా మళ్లించారని ఆరోపిస్తూ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న గోల్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) బ్యాంకులో రూ.12 కోట్ల మేర అక్రమాల ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. బ్యాంకు మాజీ సీఈవో బల్లమోని యాదయ్య, క్లర్క్ సురేందర్ యాదవ్ కుమ్మక్కై డిపాజిటర్ల నిధులను అక్రమంగా మళ్లించారని ఆరోపిస్తూ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
బాధితుల కథనం ప్రకారం, 2008 నుంచి 2011 మధ్య కాలంలో బ్యాంకులో సుమారు రూ.12 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. విషయం వెలుగులోకి రావడంతో డిపాజిటర్లు బ్యాంకు ఎదుటకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ కష్టార్జిత సొమ్మును భద్రంగా ఉంటుందని నమ్మి బ్యాంకులో జమ చేస్తే మోసానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. కుంభకోణానికి బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. డిపాజిటర్ల ఆందోళనతో బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను ఏర్పాటు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి డిపాజిటర్లతో మాట్లాడారు.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై బ్యాంకు నూతన సీఈవో యాదగిరి రెడ్డి స్పందించారు. బ్యాంకులో జరిగిన అక్రమాలకు సంబంధించిన అంశాలు గుర్తించిన వెంటనే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అన్ని ఆర్థిక లావాదేవీలు, రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. పూర్తి స్థాయి విచారణ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
డిపాజిటర్లకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, బ్యాంకు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని యాదగిరి రెడ్డి హామీ ఇచ్చారు. అయితే, కుంభకోణం పరిమాణం, నిధుల మళ్లింపు ఎలా జరిగిందనే అంశాలపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.