ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు సరికొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం ఎర్రగడ్డలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన పరిస్థితి విషమంగా ఉండగా.. ఘటనకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. అందులో తన ఆత్మహత్యకు నలుగురు కారణమని పేర్కొంటూ, సదరు మహిళా అధికారితో ఏడాదిగా ఉన్న రిలేషన్ గురించి కీలక విషయాలను ప్రస్తావించారు.
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై వేధింపుల ఆరోపణల కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఆయనను ఎర్రగడ్డలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు ముందు ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ లేఖలో ఆయన పలు కీలక విషయాలను ప్రస్తావించారు.
సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
తన ఆత్మహత్యకు నలుగురు వ్యక్తులు కారణమంటూ ఉదయ్ కృష్ణారెడ్డి తన సూసైడ్ నోట్‌లో తెలిపారు. ‘‘నా తోటి బ్యాచ్‌మేట్‌తో గత ఏడాది కాలంగా నేను రిలేషన్‌లో ఉన్నాను. పెళ్లి జరిగిన తర్వాత కూడా మా మధ్య ఈ రిలేషన్ కొనసాగింది. ఆమె తనంతట తానుగానే నా రూమ్‌కు వచ్చేది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు నా మొబైల్ ఫోన్‌లో భద్రంగా ఉన్నాయి. ఈ విషయాన్నే సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్తకు కూడా నేను స్వయంగా వివరించాను. నా దగ్గరున్న ఆధారాలన్నీ నా ఫోన్‌లోనే ఉన్నాయి’’ అని ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లేఖలో సంచలన నిజాలను బయటపెట్టారు.
అసలు కేసు నేపథ్యం ఏమిటి?
కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వివాదం వెలుగు చూసింది. ఉదయ్ కృష్ణారెడ్డి తనకు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధించాడని, అంతటితో ఆగకుండా గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులిమి, మెడపై కత్తిపెట్టి ప్రాణ బెదిరింపులకు గురిచేశాడని ఆమె ఫిర్యాదులో తెలిపారు. అలాగే తన వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి, వాటిని తన భర్తకు పంపుతూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఎన్‌పీఏ ప్రివిలేజ్ కమిటీ ప్రాథమిక విచారణ చేపట్టి.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళా అధికారిణి ఆరోపణల్లో నిజముందని నిర్ధారించడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.