చంద్రగ్రహణం ఎప్పుడు.. ఎలాంటి పరిహారాలు పాటించాలి?


 మార్చి 3న చంద్ర గ్రహణం ఉందంటున్నారు. దీని ప్రభావం మన దేశంపై ఎలా ఉంటుంది? గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆచరించాల్సిన పరిహారాలేంటి? ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పండి? - హరీశ్‌

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో 03-03-2026 మంగళవారం పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్ర గ్రహణం (Lunar eclipse 2026). దృక్‌సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మార్చి 3న ఫాల్గుణ పౌర్ణమి రోజు మంగళవారం పూర్వ ఫాల్గుణి (పుబ్బ నక్షత్రంనందు) సింహ రాశిలో కేతుగ్రస్త గ్రస్తోదయ పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మర్షి చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం భారతదేశంలో సంభవిస్తుందని తెలిపారు. అందువల్ల ఆ రోజు గ్రహణ నియమాలను పాటించాలని సూచించారు. ఆలయాల మూసివేత, గ్రహణ పట్టు విడుపు స్నానాలు, గ్రహణ శాంతులు వంటివి ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన దేశంలో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుందని, అందువల్ల దీన్ని గ్రస్తోదయ చంద్రగహణం అని పండితులు పేర్కొన్నారని వివరించారు.

ఇది సంపూర్ణ గ్రహణమైనప్పటికీ..  భారతదేశంలో సాయంత్రం 6గంటల 20 నిమిషాలకు.. చంద్రోదయమైన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ గ్రహణ నియమాలు పాటించాలి. (Lunar eclipse 2026 Date and Time)

  • గ్రహణం ప్రారంభ సమయం: మార్చి 3న మధ్యాహ్నం 3గంటల 21 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం భారతదేశపు తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. సింగపూర్‌, చైనా వంటి దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ గ్రహణం స్పష్టంగా ఆ సమయంలో కనిపిస్తుంది. గ్రహణ మధ్య కాలం: సాయంత్రం 5గంటల 3 నిమిషాలు. గ్రహణ మధ్య సంపూర్ణ కాలం: సాయంత్రం 5గంటల 32 నిమిషాలు. గ్రహణ మోక్ష కాలం: సాయంత్రం 6గంటల 48 నిమిషాలు. మొత్తంగా ఈ గ్రహణం ఏర్పడే పూర్తి సమయం (సర్వ కాలం): 3గంటల 27 నిమిషాల కాలం.
  • మన దేశంలో చంద్రోదయం అయ్యాక ఈ గ్రహణం అనేక ప్రాంతాల్లో 25 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్య కనిపించడం వల్ల ఇక్కడ గ్రహణ ప్రభావం ఉంది. అందువల్ల గ్రహణ సమయంలో గ్రహణ విధులు, గ్రహణ శాంతులు, ఆలయాలను మూసివేయడం వంటివి ఆచరించాలి. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు మధ్యాహ్నం 12గంటల లోపు భోజనాది కార్యక్రమాలు ముగించి గ్రహణ సమయం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిది. 
  • ఈ గ్రహణం సింహ రాశిలో సంచరించడం వల్ల సింహ రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది.
  • గ్రహణ ప్రభావం సింహ రాశి, కుంభరాశి, కర్కాటక రాశి, మకర రాశి వారిపై  చెడు ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. మిగిలిన రాశుల మీద మధ్యస్థ, అనుకూల ఫలితాలు ఉన్నాయి.
  • చెడు ఫలితాలు ఉన్న రాశుల వారు గ్రహశాంతులు, జపాలను మరుసటి రోజు ఆచరించడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడతారు.

ఆచరించాల్సిన నియమాలు- పరిహారాలు:

  • గ్రహణానికి ముందు పట్టు స్నానం (తల స్నానం-సబ్బులు, షాంపూలు ఉపయోగించకూడదు), గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలి. ముఖ్యంగా గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకుండా భగవన్నామస్మరణ చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. 
  • గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఆ కాలంలో చేసే దానాలకు విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఆ సమయంలో చేసే జప, తప, ధ్యానాలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది. గ్రహణ సమయంలో స్నానం సంకల్ప సహితంగా చేయాలని శాస్త్రం. 
  • గ్రహణ సమయంలో దుర్గాదేవి, శివనామ స్మరణ, నారాయణ ఉపాసన వంటివి విశేషమైన శక్తి, పుణ్యాలను కలుగజేస్తాయి. ఉపనయనం అయినవారు గ్రహణ సమయంలో గాయత్రీ మంత్రం వంటివి జపించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.
  • చంద్ర గ్రహణం సమయంలో వెండి, బియ్యం, గోదానం వంటివి విశేష పుణ్యఫలితాలను ఇస్తాయి.
  • గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, పూజామందిరాన్ని, దేవతామూర్తుల విగ్రహాలను శుభ్రపరుచుకోవాలి. ఏదైనా నిల్వ ఉండే ఆహార పదార్థాలు (ఊరగాయ) వంటి వాటిపై దర్భలను ఉంచడం శ్రేయస్కరం.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow