మీరెప్పుడైనా ఊహించారా.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా దొరుకుతుందని? ప్రభుత్వ బడిలో సీట్ల కోసం విద్యార్ధులు బారులు తీరుతారని..? ఇప్పుడు సిద్దిపేటలో అది నెరవేరింది. పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 8వ తరగతుల్లో 210 సీట్లు ఉండటం.. వందలాదిగా విద్యార్థులు సీట్ల కోసం ఎగబడటంతో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. ఇలా ఎక్కువ మంది పోటీపడుతుండటంతో పదేళ్లకుపైగా పోటీ పరీక్ష నిర్వహిస్తున్నారు. జూన్ 10న నిర్వహించిన పరీక్షకు 600 మంది హాజరయ్యారు..
సిద్దిపేట, జూన్ 11: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా.. వీటిల్లో విద్యార్ధుల చేరికలు అరకొరగా ఉన్నాయి. కొన్ని స్కూళ్లు జీరో ప్రవేశాలు అంటే ఒక్క స్టూడెంట్ కూడా లేకపోవడంతో మూత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ బడిలో మాత్రం సీటు కోసం విద్యార్ధులు పోటీ పడుతున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటంతో తల్లిదండ్రులు, విద్యార్ధులు ఆ ప్రభుత్వ బడిలో అడ్మిషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో చేసేలేక అక్కడి ప్రధానోపాధ్యాయులు ప్రవేవాలకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాడు. అంతగా పోటీ పడుతున్న ఆ స్కూల్ ఎక్కడుందనేగా మీ సందేహం.. అదే సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ పబ్లిక్ స్కూల్. ఇక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు యేటా ప్రవేశాల కోసం జూన్ నెలలో బారులు తీరుతారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థుల నుంచి ప్రతి ఏడాది భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో గత రెండేళ్లుగా ప్రవేశ పరీక్ష నిర్వహించి సీట్లు కేటాయించారు. ఈసారి కూడా వరుసగా మూడో ఏడాది ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించింది.
బుధవారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు మొత్తం 691 మంది విద్యార్థులు హాజరయ్యారు. 6వ తరగతిలో అందుబాటులో ఉన్న 180 సీట్లకు, 8వ తరగతిలో ఖాళీగా ఉన్న 40 సీట్లకు ఈ పరీక్ష నిర్వహించారు. విచిత్రమేమంటే.. సిద్దిపేటతోపాటు నిజామాబాద్ జిల్లా బోధన్, మెదక్ జిల్లా శివ్వంపేట, సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు కూడా పరీక్ష రాయడానికి సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. పాఠశాలలో హాస్టల్ సౌకర్యం లేదని ప్రధానోపాధ్యాయుడు ఏ రాజా ప్రభాకర్ రెడ్డి సూచించినప్పటికీ.. తమ పిల్లలకు సీటు వస్తే చాలని.. వారిని స్థానిక ప్రైవేట్ హాస్టళ్లలో ఉంచిమరీ చదివిస్తామని తల్లిదండ్రులు చెప్పడం విశేషం.