దేశంలోని పోలీస్​ శాఖ పనితీరులో మనమే నంబర్​ వన్

jayyapal jvs media
2 minute read

 

దేశంలోని పోలీస్​ శాఖ పనితీరులో మనమే నంబర్​ వన్​ - జ్యుడిషియరీలో రెండో స్థానం - TELANGANA IS NUMBER ONE POLICING

ఇండియా జస్టిస్​ రిపోర్ట్​ -2025 - దేశంలోనే పోలీసుశాఖ పనితీరులో తెలంగాణ మొదటి స్థానం - జ్యుడిషియరీలో రెండో స్థానం

దేశంలోనే పోలీసుశాఖ పనితీరులో తెలంగాణ మొదటి స్థానం సాధించింది. ప్రజలకు న్యాయం అందించే విషయంలో 18 రాష్ట్రాలతో(కోటి కంటే ఎక్కువ జనాభా) పోల్చినప్పుడు ఈ ఘనతను సాధించింది. ఈ మేరకు ఇండియా జస్టిస్​ రిపోర్ట్​ -2025 పేరుతో టాటా ట్రస్ట్​ మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. ప్రజలకు న్యాయం అందించే న్యాయస్థానాలు, పోలీసులు, జైళ్లు, న్యాయ సహాయం వంటి విభాగాల పనితీరును అధ్యయనం చేస్తున్న టాటా ట్రస్ట్​ 2019 నుంచి రాష్ట్రాలకు ర్యాంకింగ్​లు ఇస్తూ వస్తోంది. దీనికి సెంటర్​ ఫర్​ సోషల్​ జస్టిస్​, కామన్​ కాజ్​, కామన్​వెల్త్​ హ్యూమన్​ రైట్స్​ ఇనిషియేటివ్​ వంటి తదితర సంస్థల సహకారంతో తాజాగా నివేదికను రూపొందించి, విడుదల చేశాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం కైవసం చేసుకుంది.

ఇండియా జస్టిస్​ రిపోర్ట్​ -2025లో ముఖ్యాంశాలు :

  • నాలుగో ఎడిషన్​ ర్యాంకుల్లో దేశవ్యాప్తంగా పోలీసింగ్​లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. జ్యుడిషియరీలో రెండో స్థానం, జైళ్ల విభాగంలో ఏడో స్థానం, లీగర్​ ఎయిడ్​లో పదో స్థానంలో ఇలా 6.15 స్కోర్​తో ఓవరాల్​గా మూడో స్థానంలో నిలవగా, కర్ణాటక రాష్ట్రం 6.78 స్కోర్​తో మొదటి స్థానంలో నిలిచింది.
  • 2019లో వెలువడిన మొదటి ఎడిషన్​లో ఓవరాల్​ ర్యాంకుల్లో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2020,2022లో మూడో స్థానంలో నిలవగా ఈసారి 2025లో మళ్లీ అదే స్థానాన్ని నిలబెట్టుకుంది.
  • తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10.6 చదరపు కిలోమీటర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 282 చదరపు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీస్​ స్టేషన్​ ఉంది. అతి తక్కువ పరిధిలో పోలీస్​ స్టేషన్లు ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానం సాధించింది. తెలంగాణలోని 85 శాతం పోలీస్​ స్టేషన్లలో సీసీ కెమెరాలు, మహిళా సహాయ డెస్కులు ఉన్నాయి.
  • కానిస్టేబుళ్ల స్థాయిలో రాష్ట్రంలో 13 శాతం మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఇది జాతీయ సగట కంటే చాలా తక్కువ. తెలంగాణ పోలీసుశాఖలో కేవలం 9 శాతం మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు. ఇది కూడా జాతీయ సగటు కంటే చాలా తక్కువ.

మహిళా జడ్జిల్లో మొదటిస్థానం : రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో 21 శాతం, హైకోర్టు జడ్జిల్లో 29 శాతం, సిబ్బందిలో 24 శాతం ఖాళీలు ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ హైకోర్టులో 33 శాతం, జిల్లా కోర్టుల్లో 55 శాతం మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.జైళ్లలో 59 శాతం వైద్యుల్లేరు : తెలంగాణ జైళ్లలో 59 శాతం వైద్యులు అందుబాటులో లేరు. 2022-23 నాటి లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలోని జైళ్లలో 6,500 మంది ఖైధీలు ఉండగా, ఒక్కొక్కరిపై ఏడాదికి రూ.33,277 చొప్పున ఖర్చు చేశారు.

లీగల్​ సర్వీస్​ క్లినిక్​లు : ప్రజలకు అవసరమైన న్యాయసహాయం అందించే లీగల్​ సర్వీస్​ క్లినిక్​లో, తెలంగాణలో 440 గ్రామాలకొకటి మాత్రమే ఉండగా, మొత్తం లీగల్​ ఎయిడ్​ బడ్జెట్​లో 80 శాతాన్ని రాష్ట్రం కేటాయించింది. 2022-23 సంవత్సరంలో పూర్తి నిధుల్ని ఇందుకు ఖర్చు చేసింది.

Tags
Chat