నెరవేరిన అయ్యప్ప భక్తుల కల! శబరిమల దర్శనానికి కొత్త మార్గం! ఇక సంతృప్తిగా స్వామి దర్శనం! - SABARIMALA DARSHAN ROUTE CHANGED
Sabarimala darshan route changed for devotees
Sabarimala darshan route changed for devotees
Sabarimala Darshan Route Changed : శబరిమల అయ్యప్ప భక్తులు ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌పై ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి దర్శన మార్గంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. అయ్యప్ప సన్నిధానంలోని పవిత్రమైన 18 మెట్లను ఎక్కిన వెంటనే, స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఇప్పటి వరకు 18 మెట్లను ఎక్కిన తర్వాత, ఒక వంతెన వైపుగా భక్తులను పంపేవారు. దాని మీదుగా క్యూ లైనులో పంపుతూ కేవలం 5 సెకన్లు అయ్యప్పను దర్శించుకునేందుకు అనుమతిస్తున్నారు. అయ్యప్పను దర్శించుకుంటున్న లక్షల మందిలో దాదాపు 80శాతం మందికి సంతృప్తికరమైన దర్శనం కలగలేదు అని టీడీబీ అధ్యక్షుడు పి.ఎస్.ప్రశాంత్ అన్నారు. దీనిపై దేవస్థానం బోర్డుకు భక్తుల నుంచి వేల సంఖ్యలో లేఖలు, విజ్ఞప్తు వచ్చని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ప్రధాన పూజారి సలహా తీసుకున్న తర్వాతే!
సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను టీడీబీ అధ్యక్షుడు పి.ఎస్.ప్రశాంత్ వెల్లడించారు. ఈ మార్పును తొలి విడతలో మార్చి 15 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. ఈ వ్యవధిలో మాసిక పూజలు, 12 రోజుల విష్ణు పూజల సందర్భంగా కొత్త మార్గంలో భక్తులకు స్వామివారి దర్శన అవకాశాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు.
''ఈ పద్ధతి విజయవంతమైతే, ఇకపై కొత్త మార్గంలోనే స్వామి వారి దర్శనానికి భక్తులను పంపుతాం. వచ్చే మండలం-మకర విలక్కు సీజన్‌లోనూ అంతే. ఈ మార్పు చేయాలంటూ మాకు భక్తుల నుంచి వేలాదిగా లేఖలు వచ్చాయి'' అని పి.ఎస్.ప్రశాంత్ చెప్పారు. అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి (తంత్రి), ఇతర పండితుల సలహాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కొత్త మార్గంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఒక్కో భక్తుడికి సగటున 20 నుంచి 25 సెకన్ల సమయం పడుతుందన్నారు.'గ్లోబల్ అయ్యప్ప డివోటీస్'
''అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధిలో భక్తులు కూడా భాగం కావచ్చు. ఇందుకోసం 'గ్లోబల్ అయ్యప్ప డివోటీస్' పేరుతో పంబలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఇందులో దాదాపు 150 మంది భక్తులు పాల్గొంటారని అంచనా. మే నెలలో స్వామివారి మాసిక పూజలు మొదలవుతాయి. అదే నెలలో 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి'' అని టీడీబీ అధ్యక్షుడు పి.ఎస్.ప్రశాంత్ తెలిపారు.జీఆర్‌టీ, కల్యాణ్‌కు బంగారు లాకెట్ల టెండర్లు
''అయ్యప్ప స్వామి ఫొటోతో బంగారు లాకెట్లను తయారు చేసి సప్లై చేసే టెండర్లను తమిళనాడుకు చెందిన జీఆర్‌టీ జ్యువెల్లర్స్, కేరళకు చెందిన కల్యాణ్ జ్యువెల్లర్స్ దక్కించుకున్నాయి. 1 గ్రాము, 2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాముల సైజుల్లో ఈ లాకెట్లు లభిస్తాయి. వీటిని ఏప్రిల్ 14న విషుక్కైనీత్తం సందర్భంగా పంపిణీ చేస్తాం. ఈ లాకెట్లు కావాలనుకునే భక్తులు www.sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు'' అని ఆయన చెప్పారు. ''వివిధ పూజల కోసం తీసుకునే ఛార్జీలను 30 శాతం మేర పెంచాలని నిర్ణయించాం. చివరిసారిగా 2016లో ఈ రేట్లు పెరిగాయి. ఐదేళ్లకోసారి రేట్లను పెంచుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి'' అని ప్రశాంత్ గుర్తు చేశారు