HMDA Scope Increased : హైదరాబాద్ మహానగర పాలక అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధి మరింత పెరిగింది. కొత్తగా మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని 16 మండలాలను ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో చేర్చింది. 11 జిల్లాల పరిధిలోని 104 మండలాలు, 1355 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిగా పేర్కొంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు 7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హెచ్ఎండీఏ పరిధి కొత్తగా 16 మండలాలు కలవటంతో 10,472 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
ఆర్ఆర్ఆర్ ఏర్పాటుతో పట్టణీకరణ, వేగవంతమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ పరిధిని విస్తరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. HMDA పరిధిలో రంగారెడ్డి జిల్లా మొత్తం ఉన్నప్పటికీ ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటుచేయనున్న దృష్ట్యా 36 రెవెన్యూ గ్రామాలను హెచ్‌ఎంఆర్ నుంచి పురపాలక శాఖాధికారులు మినహాయించారు. హైదరాబాద్ మెట్రోపాలిటిన్ రీజియన్‌లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 533 రెవెన్యూ గ్రామాలుండగా, అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌జిల్లాలో మూడు మాత్రమే ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉండేవి. కానీ ఇప్పుడు మరో నాలుగు జిల్లాలు కలిపారు.
హెచ్ఎండీఏ పేరు మార్పు : హైదరాబాద్ ఇక మహా మహా నగరంగా మారనుంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్‌ఎంఆర్)ను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రీజనల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) వస్తుండటంతో భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం పురపాలక ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. గెజిట్‌లో ప్రచురించాల్సిందిగా సంబంధిత శాఖను ఆయన ఆదేశించారు.
హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలను చేరుస్తూ ఉత్తర్వులు జారీ
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని మండలాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం
వీటిని చేర్చడం ద్వారా కొత్తగా హెచ్ఎండీఏ పరిధిలోకి 3 వేల చ.కి. భూభాగం
దీంతో హెచ్ఎండీఏ పరిధిలో మొత్తంగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1,350 గ్రామాలు ఉన్నాయి