అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ భారత-పాకిస్థాన్ దేశాలకు సంబంధించి మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం ఇండియా-పాకిస్థాన్ దేశాల మధ్య..
US President Trump on India Pakistan War
US President Trump on India Pakistan War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ భారత-పాకిస్థాన్ దేశాలకు సంబంధించి మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం ఇండియా-పాకిస్థాన్ దేశాలకు సంబంధించి సీజ్ ఫైర్ అమలు ప్రకటన చేసినప్పటి నుంచి ట్రంప్ రోజూ ఇండియా, పాకిస్థాన్ లను ఉద్దేశించి ఏదోక సంచలన ప్రకటన చేస్తుండటం గమనార్హం. నిన్న ఇండియా-పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాలు అంగీకరిస్తే ముందుకొస్తామని ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనికి భారత్ నుంచి వ్యతిరేకత వ్యక్తంకాగా, పాకిస్థాన్ నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఇవాళ, మళ్లీ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ అమలు చేయకపోతే, ఆయా దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని భారత్, పాక్ లకు హెచ్చరికలు వంటివి జారీచేశారు. భారత్ - పాకిస్తాన్ దేశాల నాయకత్వం దృఢంగా, శక్తివంతంగా ఉందన్న ఆయన, ఇది చాలా గర్వించదగ్గ విషయమన్నారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు తాము సాయం చేశామని, అలాగే ఇరుదేశాలతో పెద్ద ఎత్తున వాణిజ్యం చేసి వాళ్లకి అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఒక వేళ భారత, పాకిస్థాన్ లు కాల్పుల విరమణను పాటించకపోతే, తాము ఆయా దేశాలతో ఎటువంటి వాణిజ్యం చేయబోమని కూడా హెచ్చరించారు. భారత, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ శాశ్వతమైనదిగా తాను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. ఇరు దేశాలు చాలా అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలని.. తాము ఈ అణు సంఘర్షణను ఆపామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఫలితంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలు పోకుండా మంచి జరిగిందన్నారు. దీనికి ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నానని ట్రంప్ అన్నారు.
"మేము పాకిస్తాన్‌తో చాలా వాణిజ్యం చేయబోతున్నాము. భారతదేశంతో చాలా వాణిజ్యం చేయబోతున్నాము. మేము ప్రస్తుతం భారతదేశంతో చర్చలు జరుపుతున్నాము. త్వరలో పాకిస్తాన్‌తో చర్చలు జరపబోతున్నాము." అని ట్రంప్ అన్నారు. ఇలా ఉండగా, మే 10 వ తేదీన భారత్, పాక్ సీజ్ ఫైర్ విషయం గురించి ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్టులో 'రాత్రంతా భారత్, పాకిస్థాన్ దేశాలతో అమెరికా చర్చలు జరిపింది. రెండు దేశాలు తక్షణమే పూర్తిస్థాయిలో కాల్పులను విరమించేందుకు అంగీకరించాయి. ఈ విషయాన్ని ప్రకటించడం తనకు ఎంతో సంతోషంగా ఉంది. కామన్ సెన్స్‌ను, గొప్ప విజ్ఞతను ఉపయోగించి రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవడాన్ని నేను అభినందిస్తున్నా. ఈ విషయంలో శ్రద్ధ పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు.' అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో తెలిపారు.
ఇలాఉండగా, భారత్, పాక్ యుద్ధం గురించి ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు జనాలకి మతులు పోగొడుతున్నాయి. అంతర్జాతీయ టారిఫ్స్ విషయంలో ట్రంప్ చేసిన ట్రిక్కులు, చమక్కులు, కప్పదాట్లు తరహాలోనే భారత్, పాకిస్థాన్ వ్యవహారాన్ని కూడా చేస్తారా అంటూ విశ్లేషకులు అంటున్నారు. కాసేపు ఇరు దేశాలు ముందు చూపుతో వ్యవహరించి కాల్పుల విరమణకు వచ్చాయని, తర్వాత.. ఇరుదేశాల వ్యవహారంలో తలదూర్చి సమస్య పరిష్కరిస్తామని, ఆపై, వాణిజ్యం చేయమంటూ బెదిరిస్తే దారికొచ్చారంటూ ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.