MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్


 హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ జాగృతి నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కలిసి ఇవాళ(మంగళవారం) బస్ భవన్‌ను ముట్టడించేందుకు కవిత ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ మేరకు కవిత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కవిత ధర్నాతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

దీంతో కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను చంద్రయాణ గుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంటోందని.. విద్యార్థులు, ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రయాణ గుట్ట పోలీస్ స్టేషన్‌కు కవితను తరలించారు. దాంతో జాగృతి కార్యకర్తలు సైతం భారీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అన్ని రకాల బస్‌ పాస్ ఛార్జీలను టీజీఎస్‌ఆర్టీసీ పెంచింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌తోపాటు మెట్రో డీలక్స్ ఛార్జీలనూ పెంచేసింది. దాదాపు 20 శాతం మేర ఛార్జీలను పెంచడంతో హైదరాబాద్ నగర వాసులపై అధిక భారం పడనుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ బస్ పాస్ ఛార్జీల పెంపుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్పందించారు.


బస్ పాస్ ఛార్జీలు పెంచి చాలా కాలమైందని.. ఈ నేపథ్యంలో వాటిని పెంచాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. బస్ ఛార్జీల పెంపు నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బస్ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు

Previous Post Next Post

نموذج الاتصال