హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly budget session) బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Telangana Governor Jishnu Dev Varma) ప్రసంగించారు. ఘనమైన సంస్కృతి నిలయం తెలంగాణ అని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారన్నారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామన్నారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతోందని గవర్నర్ వెల్లడించారు. రైతులకు మద్దతివ్వడం, వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. దేశంలోనే ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని.. ఇదే రైతుల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 23.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని తెలిపారు. ఎకరానికి రూ.12 వేలు చొప్పున రైతులకు అందిస్తున్నామని.. రైతు నేస్తం అమలు చేస్తున్నామని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు.