ఎల్‌ఆర్‌ఎస్‌ తెచ్చిన తంటా వేల ప్లాట్లు నిషేధిత జాబితాలోకి...

jayyapal jvs media
3 minute read




సామాన్యులకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఇప్పుడు కొత్త తంటాను తెచ్చిపెట్టింది. పైసాపైసా పోగు చేసుకుని ఇల్లు కట్టుకుందామని కొనుగోలు చేసిన ఇంటి స్థలాలు నిషేధిత జాబితాలో చూపిస్తుండడతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. రెవెన్యూ, రిజిస్ర్టేషన్‌, మున్సిపాలిటీల మధ్య సమన్వయ లోపం సామాన్యుడికి శాపంగా మారింది.

రామగుండంలో ఇష్టానుసారంగా ప్రొహిబిటెడ్‌లో చేర్చిన యంత్రాంగం

కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలన్నీ నిషేధిత జాబితాలోనే...


ఆందోళన చెందుతున్న సామాన్య జనం


కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు


డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసినా మళ్లీ అదే తంతు


రిజిస్ర్టేషన్లపైనా ప్రభావం


చేతులెత్తేస్తున్న మున్సిపల్‌ యంత్రాంగం


 ఎల్‌ఆర్‌ఎస్‌ ఇప్పుడు కొత్త తంటాను తెచ్చిపెట్టింది. పైసాపైసా పోగు చేసుకుని ఇల్లు కట్టుకుందామని కొనుగోలు చేసిన ఇంటి స్థలాలు నిషేధిత జాబితాలో చూపిస్తుండడతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. రెవెన్యూ, రిజిస్ర్టేషన్‌, మున్సిపాలిటీల మధ్య సమన్వయ లోపం సామాన్యుడికి శాపంగా మారింది. ప్రభుత్వం నుంచి మార్కెట్‌ రేటుపై స్థలాలు కొనుగోలు చేసి కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలు, పట్టాదారుల నుంచి కొనుగోలు చేసిన భూములను సైతం గుడ్డిగా ప్రొహిబిటెడ్‌లో చేర్చారు.


ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో ఒక ప్రముఖ వ్యాపారి ప్రధాన రహదారి పక్కన ఉన్న స్థలం ఎఫ్‌టీఎల్‌లో పడింది. ఎన్టీపీసీకి చెందిన పాత ఆయిల్‌మిల్‌ ప్రాంతంలో మరో వ్యక్తి ప్లాట్‌ కూడా ఎఫ్‌టీఎల్‌లోనే చూపుతుంది. ఎన్టీపీసీలోని ఏవీ ఫంక్షన్‌హాల్‌ పక్కన గోదావరిఖనికి చెందిన ఒక ప్రముఖుడి స్థలం ప్రొహిబిటెడ్‌లో పడింది. విచారణ చేస్తే అది ఒక ప్రముఖ చిట్‌ఫండ్‌ కంపెనీలో షూరిటీ ఉన్నట్టు చూపుతోంది. ఆ కంపెనీ పేరే తాను వినలేదని, ఈసీ చూపినా కూడా సరికాని పరిస్థితి. అలాగే ఎఫ్‌సీఐ గౌతమినగర్‌లోని సగం ప్రాంతం ప్రొహిబిటెడ్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం 40 నుంచి 50ఏళ్ల క్రితం మార్కెట్‌ రేటుపై ఉద్యోగులకు, మాజీ సైనికుల హౌసింగ్‌ సొసైటీలకు ఇచ్చిన భూములు సైతం ప్రొహిబిటెడ్‌లో పెట్టారు. గోదావరిఖని మార్కండేయకాలనీలో చుట్టూ భవనాలు ఉండి మధ్యలో ఖాళీగా ఉన్న స్థలం కూడా ప్రొహిబిటెడ్‌లో పడింది. సింగరేణి ప్రాంతంలోని స్థలాలను ప్రభుత్వం క్రమబద్ధీకరించగా వాటిలో ఎక్కువ భాగం ప్రొహిబిటెడ్‌లోకి వెళ్లిపోయాయి.


జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం క్రితం 25,513 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 5,735కాగా, మిగిలినవి రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో ఉన్నాయి. ఈ నెల 25వేల దరఖాస్తుల్లో 4,521 దరఖాస్తులు ప్రొహిబిటెడ్‌ జాబితాలో ఉన్నాయి. అసైన్డ్‌, ప్రభుత్వం, ఇనాం, దేవాదయ, వక్ఫ్‌ భూములు, చెరువులు, కుంటలు, నాలాల ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌ జోన్‌ పరిధిలోని భూములు, హైటెన్షన్‌ వైర్ల సమీపంలోని భూములు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. చెరువులు, కుంటలకు 200మీటర్ల దూరం వరకు ఉన్న భూములు సైతం ఎఫ్‌టీఎల్‌లో పెట్టారు. 16,910 దరఖాస్తులకు ఫీజు అప్రువల్‌ చేసి దరఖాస్తుదారులకు పంపారు. ప్రొహిబిటెడ్‌తో సంబంధం లేకుండా 3,568 దరఖాస్తులు మున్సిపల్‌, రెవెన్యూ, నీటి పారుదలశాఖ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అప్రువల్‌ లేకుండా పెండింగ్‌లో ఉన్నాయి. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 7,078 దరఖాస్తులు వస్తే కేవలం 3,920 దరఖాస్తులకు మాత్రమే ఫీజు అప్రువల్‌ ఇచ్చారు. మిగతా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి.


ఫ ఇష్టానుసారంగా ప్రొహిబిటెడ్‌ జాబితాలోకి...


జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో 4,521 దరఖాస్తులు ప్రొహిబిటెడ్‌లోకి వెళ్లాయి. ఇందులో కేవలం రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖ ఇష్టానుసారంగా ఇచ్చిన జాబితా ఆధారంగానే ప్రొహిబిటెడ్‌లో పెట్టారు. సివిల్‌ వివాదాల్లో కోర్టు కేసులు, తీర్పులకు అనుగుణంగానే ప్రొహిబిటెడ్‌లో పెట్టాల్సి ఉంటుంది. కానీ లీగల్‌ నోటీసులు ఇచ్చినా ప్రొహిబిటెడ్‌లో పెట్టారు. రామగుండం అర్బన్‌లో ఒకే తహసీల్దార్‌ కార్యాలయం ఉంది. ప్రస్తుతానికి ఆ తహసీల్దార్‌ కార్యాలయంలో పాత భూముల రికార్డులేవి అందుబాటులో ఉన్న పరిస్థితే లేదు. గతంలో సీసీఎల్‌ఏ, క్యాబినెట్‌ ఆమోదాలతో మార్కెట్‌ రేటుపై హౌసింగ్‌ సొసైటీలకు ఇచ్చిన భూముల్లో కాలనీలు సైతం వెలిశాయి. ఇల్లు కట్టుకోని వారి స్థలాలను ఇప్పుడు ప్రొహిబిటెడ్‌లో పెట్టారు. గోదావరిఖని మార్కండేయకాలనీ, ఎన్‌టీపీసీ కృష్ణానగర్‌ తదితర ప్రాంతాల్లో ఒక్కో సర్వే నంబర్‌లో 10ఎకరాల భూమి ఉంటే ఒక్క ప్లాట్‌పై ఉన్న కేసును పరిగణలోకి తీసుకుని ఆ సర్వే నంబర్‌నే ప్రొహిబిటెడ్‌లో పెట్టారు. దీని ప్రభావం స్థలాల యజమానులపై పడింది. వాటిని వివాదమైన స్థలాలుగా ప్రచారం అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో భూముల యజమానులు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి సిబ్బందితో గొడవలు పడుతున్నారు.


ఫ డాక్యుమెంట్లు సమర్పించినా, ఫీజు చెల్లించినా అదే తంతు...


ప్రొహిబిటెడ్‌ జాబితా నుంచి తీసివేయాలంటే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకోవాలని, హౌసింగ్‌ సొసైటీలు వారికి కేటాయించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసినా, ఫీజు చెల్లించినా మళ్లీ ప్రొహిబిటెడ్‌ జాబితాలోకే వెళుతుంది. దీంతో సామాన్యులు పరేషాన్‌ అవుతున్నారు. చట్ట పరంగా తమకు అన్నీ అనుమతులు ఉన్నా ఎందుకు ప్రొహిబిటెడ్‌లో పెడతారంటూ గొడవకు దిగుతున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మున్సిపల్‌ సిబ్బంది సైతం తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం విషయంలో ఒక వైపు ఒత్తిడి ఉండగా సమస్యల విషయంలో మాత్రం ఇటు జిల్లా యంత్రాంగం గానీ, టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టరేట్‌ కార్యాలయం కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇష్టానుసారంగా ప్రొహిబిటెడ్‌ జాబితాలో చేర్చడం వల్ల ఇప్పుడు మంచి కన్నా చెడే ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడింది.

Tags
Chat