తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి పక్ష బీఆర్ఎస్ ఈ ప్రచారాన్ని
ముమ్మరంగా కొనసాగిస్తోంది.
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ నేతలు గత కొంత కాలంగా అంటూ ఉన్నారు. ఇక, ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని తేల్చేశారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ 2014 నుంచి ఒకే చట్టం ఉంది. స్పీకర్ పదవి, విప్ పదవి, ప్రతి పక్షం అన్నీ అలానే ఉన్నాయి. ఆనాడు ఎమ్మెల్యేలు పార్టీలు మారి.. మంత్రులుగా చేశారు. మేము మంత్రులుగా కూడా చేయలేదు. మంత్రులుగా చేసిన వాళ్లు డిస్‌క్వాలిఫై కాలేదు.. ఉప ఎన్నిక రాలేదు. ఒక్కోరు ఏళ్ల పాటు మంత్రులుగా చేశారు. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలేదు. కానీ, ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి.. వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎట్లా వస్తాయి అధ్యక్షా.. చట్టం మారలేదు.. న్యాయం మారలేదు. స్పీకర్ ఆఫీసు సేమ్ ఉంది. పాలక పక్షం.. ప్రతి పక్షం అలాగే ఉంది. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెలా ఉప ఎన్నికలు వస్తాయి. ఏ రాజ్యాంగం ప్రకారం ఉప ఎన్నికలు వస్తాయో నాకు అర్థం కావటం లేదు. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం..గత అనుభవాల దృష్ట్యా.. 2014 నుంచి ఏ సంప్రదాయాలు ఆచరించారో అవే సంప్రదాయాలను మనం ఆచరిస్తాం’ అని అన్నారు.
సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఓ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఈ పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. 10 మందిపై అనర్హత వేటు వేయాలని కోరింది. అయితే, కోర్టు ఈ విషయంలో నిర్ణయాన్ని స్పీకర్‌కు వదిలేసింది. దీంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో చేరిన 10 మంది రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతోంది