భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 26: భద్రాచలంలో (Bhadrachalam) ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్థుల భవనం ఒక్కసారిగా నేలమట్టం అయ్యింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వెంటనే రెస్క్యూ అండ్ పోలీసులు బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. భవనం కింద చిక్కుకుని పలువురు మృతి చెందినట్లు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పీఠం పేరుతో ఓ అర్చకుడు మఠం నిర్మించాలని భావించి.. అత్యాశకపోయి ఓ నాశిరకం నిర్మాణం చేయడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ పాతభవనంపై మరో నాలుగు అంతస్థులు కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. అమ్మవారి పేరుతో ఓ అర్చకుడు చేస్తున్న వ్యవహారాన్ని గత ఏడాది పంచాయతీ సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో అప్పటి నుంచి నిర్మాణం నిలిచిపోయింది. ఆ సమయంలో పంచాయతీ సిబ్బందితో సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పీఠం పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడమే కాకుండా.. అమ్మవారి ఆలయాన్ని నిర్మించి.. ఆ ఆలయం పక్కనే ఈ ఆరు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. ఒకవేల భవనం ప్రారంభోత్సవమై భక్తులు ఉండి ఉంటే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈరోజు పనులు జరుగుతున్న సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే భవన యజమాని భార్య చెబుతున్న ప్రకారం.. ఇద్దరు కూలీలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శిథిలిలాల కింద ఎంతమంది ఉన్నారనేది కొద్దిసేపట్లో బయటపడనుంది. ప్రొక్లైన్‌తో శిథిలాలను తొలగించిన తర్వాత ఎంత మంది ఉన్నారనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భద్రాచలం అనేది షెడ్యూల్ ప్రాంతమని అక్కడ ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఉండవు. ఎలాంటి అనుమతులు ఉండవు. చాలా పకడ్భందీగా చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలన్నీ తుంగలో తొక్కి ఒక అర్చకుడిగా ఉన్న వ్యక్తి భక్తి ముసుగులో పంచాయతీ సిబ్బందితో గత ఏడాది క్రితం దురుసుగా ప్రవర్తించి నిర్మాణం చేపట్టాడు. కానీ ఈరోజు ఆ ఆరు అంతస్తుల నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పీఠం పేరుతో అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతడు అందుబాటులో లేడని.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.