మియాపూర్లో మ్యాన్ హోల్లో పడి కొట్టుకుపోయిండు.. వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ దగ్గర ఘటన


 హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు విషాదం నింపాయి. మియాపూర్లో తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతయిన ఘటన కలకలం రేపింది. మియాపూర్ వైశాలి నగర్ దగ్గర ఉన్న అండర్ పాస్ దగ్గర ఈ ఘటన జరిగింది. గల్లంతైన వ్యక్తిని హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్కు చెందిన బాలయ్యగా గుర్తించారు.

ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాల గాలింపు చర్యలకు దిగారు. వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ దగ్గర నాలా మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అటుగా వెళుతున్న బాలయ్య డ్రైనేజ్ నాలాలో పడి గల్లంతయ్యాడు. నేరేడ్మేట్ కాకతీయ కాలనీలో నాలాలో పడిపోయిన ఆవును హైడ్రా, DRF టీం బయటకు తీసింది.

హైదరాబాద్ సిటీలో మంగళవారం సాయంత్రం కురిసిన వానతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం నుంచి ఎండగా కొట్టగా, సాయంత్రం 5 గంటలకు షురువైన వాన రెండు గంటల పాటు దంచి కొట్టింది. సిటీలోని మెయిన్​రోడ్లు, లోతట్టు ప్రాంతాలు కాలువలను తలపించాయి. వర్షం కారణంగా ఆఫీసులు, కాలేజీలు, స్కూల్స్ నుంచి ఇండ్లకు వచ్చే టైం కావడంతో వాహనదారులు, పాదచారులు రోడ్లపై నిలిచిన నీటిలో నడవలేక అవస్థలు పడ్డారు. అసెంబ్లీ ఎదురుగా రవీంద్రభారతి నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా నీట మునిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లి ఫ్లైఓవర్ కింద, సూరారం చౌరస్తాలో రోడ్డుపై భారీగా వరద నిలిచింది. గాజులరామారం రాంకీ అపార్ట్‌‌‌‌మెంట్ వద్ద, మల్లారెడ్డి నగర్ రోడ్లపై వరద చేరడంతో ఇబ్బందులు పడ్డారు. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow