ఆశ్చర్యపరిచే ‘గురు శాపం’ కథలు.. పురాణాల్లోని ఆ గూఢార్థం ఏమిటి?
హైదరాబాద్:
భారతీయ పురాణాల్లో ఋషులు, మహర్షులు ఇచ్చిన శాపాలకు విశేష ప్రాధాన్యం ఉంది. అయితే అవి కేవలం కోపంతో ఇచ్చిన శిక్షలు మాత్రమే కాకుండా, ధర్మాన్ని నిలబెట్టే సాధనంగా కూడా భావిస్తారు. అనేక సందర్భాల్లో శాపమే గొప్ప మార్పుకు, దైవకార్యాల సాధనకు కారణమైందని పురాణ కథనాలు చెబుతున్నాయి.
గౌతమ మహర్షి, దుర్వాస మహర్షి, భృగు మహర్షి వంటి ఋషులు ఇచ్చిన శాపాల వల్ల దేవతలు, రాజులు, మహానుభావుల జీవితాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నట్లు పురాణాలు వివరిస్తాయి. మొదట శాపంగా కనిపించిన సంఘటనలు చివరికి లోకకల్యాణానికి దోహదపడిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం శాపం అనేది ప్రతీకారం కాదని, వ్యక్తి తన తప్పును గుర్తించి సన్మార్గంలో నడిచేలా చేసే ఆధ్యాత్మిక హెచ్చరికగా భావిస్తారు. అందుకే చాలా శాపాలకు విముక్తి మార్గం కూడా పురాణాల్లో పేర్కొనబడింది.
దేవతల అవతారాలు, రాక్షస సంహారం, భక్తుల రక్షణ వంటి అనేక దైవకార్యాల వెనుక కూడా గురువుల శాపాలు కారణమయ్యాయని పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల శాపాన్ని భయపడాల్సిన అంశంగా కాకుండా, ధర్మబోధకు ప్రతీకగా చూడాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
పురాణాల్లోని ఈ కథలు నేటికీ భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తూ, మంచి పనులు చేయడం, పెద్దలను గౌరవించడం, ధర్మాన్ని అనుసరించడం వంటి విలువలను గుర్తు చేస్తున్నాయి.
కాశీ నుంచి వ్యాస మహర్షిని ఎందుకు బహిష్కరించారు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణగాథ ఇదే!
కాశీకి సంబంధించిన పురాణగాథల్లో వ్యాసకాశీకి ప్రత్యేక స్థానం- గంగానది ఆవల వ్యాస మహర్షిని ప్రతిష్ఠించి పూజించిన ప్రాంతమే వ్యాస కాశీగా ప్రసిద్ధి- వ్యాస మహర్షి బహిష్కరణకు గల కారణాలు మీ కోసం!
Vyasa Kashi Story : హిందువుల మోక్ష భూమి కాశీ పట్టణంతో ముడిపడిన పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. జీవితమంతా ఎలా గడిచినా చివరి దశలో కాశీలోని మరణించాలని తపించే వారు ఎందరో ఉన్నారు. ఒక్కసారి కాశీపురిలో అడుగుపెట్టినవారికి ఇక అక్కడ నుంచి తిరిగి రావాలని అనిపించదు. కాశీలో గడిపే ప్రతి నిమిషం అమూల్యమైనది. ప్రతి రోజు విలువైనది. కానీ వ్యాస మహర్షి ఒకసారి తన తొందరపాటుతో, అహంకారంతో కాశీ పట్టణాన్ని శపించబోయి కాశీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. కాశీకి దూరంగా ఉండలేక గంగానదికి ఆవల తీరాన మరో విశ్వనాథుణ్ణి ప్రతిష్ఠించి సేవించుకున్నాడు. వ్యాసకాశీగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర ప్రదేశం వెనుక ఉన్న పురాణగాథ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
వ్యాస కాశీ ఎక్కడుంది?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నగరంలోని గంగానదికి తూర్పు ఒడ్డున, పవిత్ర దశ్వామేధ ఘాట్‌కు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో రామ్‌నగర్ కోట ప్రాంగణంలో వెలసి ఉంది. శ్రీనాథుడు రచించిన కాశీఖండం ప్రకారం కాశీ యాత్రకు వెళ్లినవారు వ్యాసకాశీలోని ప్రసిద్ధమైన వ్యాసేశ్వర ఆలయాన్ని కూడా దర్శిస్తేనే వారి యాత్ర పరిపూర్ణం అవుతుందని విశ్వాసం. అసలు వ్యాసకాశీ ఎందుకు ఏర్పడింది? దీని వెనుక ఉన్న పురాణగాథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కాశీలో అన్నం దొరకని వ్యాసుడు
ఒకసారి వేద వ్యాసుడు తన శిష్యులతో కలిసి కాశీ నగరానికి వెళ్లి, అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. సన్యాసాశ్రమం నియమాల ప్రకారం, వ్యాస మహర్షి కూడా ప్రతిరోజు వేకువఝామునే గంగా స్నానం చేసేవాడు. అగ్నికార్యం, అనుష్ఠానం పూర్తి చేసుకుని మధ్యాహ్నం సమయంలో తన శిష్యులతో కలిసి భిక్షాటనకు వెళ్లి లభించిన ఆహారంతోనే కడుపు నింపుకునేవాడు. కాశీలో ఏనాడూ వ్యాస మహర్షికి భిక్షకు లోటుండేది కాదు.
వ్యాసుని పరీక్షించదలచిన శివుడు
ఒకసారి విశ్వేశరునికి వ్యాసుని పరీక్షించాలనిపించింది. అప్పుడు విశ్వనాథుడు "వ్యాసుని అంతరంగం ఏమిటో తెలుసుకుందాం. అతనికి అతని శిష్యులకు బిక్ష లభించకుండా చేయండి" అని విశాలాక్షితో చెబుతాడు. ఆమె అందుకు సరేనని అంటుంది. మరునాడు వ్యాస మహర్షి, తన శిష్యగణంతో కలిసి ఎన్ని ఇళ్లు తిరిగినా భిక్ష లభించలేదు. "భవతి భిక్షాందేహి" అంటూ ఇల్లిల్లూ తిరిగినా పిడికెడు మెతుకులు దొరకలేదు. ఇలా వరుసగా ఏడు రోజులు వ్యాసునికి, అతని శిష్యులకు భిక్ష లభించలేదు. ఆకలితో కడుపు నకనక లాడిపోతోంది.
వ్యాసుని ఆగ్రహం
ఎంత ప్రయత్నించినా భిక్ష లభించక పోవడం వ్యాసునికి ఆశ్చర్యం కలిగించింది. సాక్షాత్తు ఆ విశ్వనాథుడు, అన్నపూర్ణగా విశాలాక్షి కొలువై ఉన్న కాశీలో ప్రతి ఇల్లాలు అన్నపూర్ణాదేవి అంటారు కదా! మరి తనకు అన్నం దొరకక పోవడం ఏంటని విస్తుపోయాడు. ఆఖరి ప్రయత్నంగా ఎనిమిదో రోజు వ్యాసుడు అతని శిష్యులు సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, కాశీలో కొలువైన సకల దేవతలకు నమస్కరించుకుని నీరసంగానే భిక్షకు బయల్దేరారు. ఆరోజు కూడా గత ఏడు రోజుల మాదిరిగానే ఎక్కడా భిక్ష దొరకలేదు.
కాశీని శపించబోయిన వ్యాసుడు
పరమ పవితమైన కాశీలో తనంతటి మహర్షికి పిడికెడు అన్నం దొరకకపోవడంతో వ్యాసుడు ఆగ్రహం చెందాడు. ఆకలి బాధతో విచక్షణ నశించింది. యుక్తాయుక్తాలు మరచి ఉక్రోషంతో, పట్టరాని ఆగ్రహంతో చేతిలోని భిక్షా పాత్రను కాశీ నడి వీధిలో నేలకేసి కొట్టాడు. తన కమండలం నుంచి పవిత్ర జలాన్ని చేతిలోకి తీసుకుని 'కాశీలో మూడు తరాల వరకు విద్య, భక్తి, ధనం లేకుండా పోవాలని' శపించబోయాడు. కానీ నీరసంతో ఒణుకుతున్న చేయి కమండలంలోని జలాన్ని అందుకోలేక పోయింది.
అన్నపూర్ణాదేవి ప్రత్యక్షం
ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక ఇంటి తలపులు తెరుచుకున్నాయి. సర్వాభరణ భూషితురాలైన ఒక నడివయసు స్త్రీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ముత్తైదువులకు ఉండాల్సిన శుభ లక్షణాలతో కళకళలాడుతున్న ఆ తల్లి వ్యాసునితో "ఓ బ్రాహ్మణుడా! ఏమిటీ అఘాయిత్యం! ఆగ్రహంతో ఒళ్లు మరచిన నీవు ఏం చేస్తున్నావో అర్ధమవుతోందా! శాంతించి లోపలకు రా! అంటూ వ్యాసుని అతని శిష్యగణాన్ని లోపలకు ఆహ్వానించింది. ఒక్కసారిగా తెప్పరిల్లిన వ్యాసుడు అప్రయత్నంగానే ఆ తల్లికి నమస్కరించాడు.
వ్యాసుని మందలించిన ముత్తైదువు
వ్యాసునితో ఆ తల్లి 'ఓ మహర్షి! బిక్ష దొరకనంత మాత్రాన కాశీని శపించబోవడం నీకు తగునా! ఇది నీకు ఆ విశ్వనాథుడు పెట్టిన పరీక్ష! నీవంటి మహర్షులు చేయవలసిన పనేనా ఇది! నువ్వు నీ శిష్యగణం గంగాతీరానికి వెళ్లి స్నానసంధ్యాదులు ముగించుకుని రండి. భోజనం చేద్దురు గాని! అని సున్నితంగా మందలించింది.
షడ్రసోపేతమైన భోజనం
అనంతరం వ్యాసుడు అతని శిష్యులు గంగాతీరానికి వెళ్లి స్నానసంధ్యాదులు ముగించుకుని రాగానే వారికి శాస్త్రోక్తంగా అవపోశనం వేసి భోజనం వడ్డించింది. షడ్రసోపేతమైన ఆ భోజనాన్ని అందరూ తృప్తిగా ఆరగించారు.
శివపార్వతుల ప్రత్యక్షం
వ్యాస మహర్షి అతని శిష్యగణం భోజనం చేసి విశ్రమిస్తుండగా అకస్మాత్తుగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు. జగన్మాత ప్రశాంత వదనంతో ఉన్నప్పటికీ భోళా శంకరుడు మాత్రం వ్యాసుని కోపంగా చూస్తూ 'ఎందరికో మోక్షాన్ని ప్రసాదించే కాశీ పట్టణాన్ని శపించేటంత గొప్పవాడివా నువ్వు? ఇక నువ్వు కాశీలో అడుగు పెట్టడానికి వీల్లేదు. నువ్వు నీ శిష్యులు వెంటనే కాశీని విడిచి వెళ్లండి' అని శివుడు ఆగ్రహంగా పలికాడు.
వ్యాసుని పశ్చాత్తాపం
చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో వ్యాసుడు పరమేశ్వరుని శరణు వేడుతాడు. కరుణించిన ఆ భోళా శంకరుడు వ్యాసుడి పట్ల ప్రసన్నుడై, వ్యాసుని కాశీలోకి అనుమతించకపోయినా, ప్రతి నెలా వచ్చే శుక్ల పక్ష అష్టమి, చతుర్దశి తిథుల్లో వ్యాసుడు కాశీ నగరంలో ప్రవేశించి భిక్ష స్వీకరించడానికి అనుమతిస్తూ వరం ఇచ్చాడు.
వ్యాసకాశీ ఇలా ఏర్పడింది!
ఆనాటి నుంచి వ్యాస మహర్షి గంగానదికి తూర్పు తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని నివసించసాగాడు. విశ్వనాథుని దర్శించకుండా ఉండలేక అక్కడే ఒక విశ్వనాథుని లింగాన్ని ప్రతిష్ఠించి పూజించసాగాడు. ప్రతి నెలా వచ్చే శుక్లపక్ష అష్టమి, చతుర్దశి తిథుల్లో కాశీ నగరంలో ప్రవేశించి విశ్వనాథుని, అన్నపూర్ణాదేవిని దర్శించి, కాశీ నగర వీధుల్లో తిరుగుతూ భిక్ష స్వీకరించసాగాడు.
వ్యాసకాశీ విశేషాలు
వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన విశ్వనాథుని లింగం వ్యాసేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఇప్పటికి వ్యాసకాశిలో ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు. వారణాసిలోని రామ నగర్ ప్రాంతంలో వెలసి ఉన్న ఈ ప్రాంతంలో వ్యాసుడు స్వయంగా నివసించాడని, తపస్సు చేశాడని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం కాశీ యాత్ర సంపూర్ణం కావాలంటే వ్యాసకాశీని కూడా తప్పకుండా దర్శించాలని తెలుస్తోంది.
వ్యాస మహర్షి జన్మదినమైన గురుపూర్ణిమ రోజు కాశీఖండంలో ఈ ఘట్టాన్ని చదివిన వారికి, విన్నవారికి కాశీయాత్ర చేసిన ఫలం లభిస్తుందని విశ్వాసం. మనం కూడా కాశీ యాత్ర చేసినప్పుడు వ్యాసకాశీని తప్పకుండా దర్శిద్దాం. అన్నపూర్ణ సమేత విశ్వనాథుని అనుగ్రహాన్ని పొందుదాం.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.