CKYC 2.0: కేవైసీ ప్రక్రియలో కీలక మార్పు.. ఆగస్టు నుంచి కొత్త సిస్టమ్

 

 బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక సేవలను వినియోగించే కోట్లాది మంది కస్టమర్లకు త్వరలో పెద్ద మార్పు రానుంది. ప్రతి సారి కొత్త అకౌంట్స్ తెరిచేటప్పుడు, కొత్త ఆర్థిక ఉత్పత్తి తీసుకునేటప్పుడు గుర్తింపు పత్రాలు మళ్లీ మళ్లీ సమర్పించే అవసరాన్ని తగ్గించేలా సెంట్రల్ కేవైసీ 2.0 వ్యవస్థను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు ఆగస్టు నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నాయి. తర్వాత దశలో మ్యూచువల్ ఫండ్స్, బ్రోకరేజ్ సంస్థలు కూడా ఇందులో చేరనున్నాయి.

ఒకసారి కేవైసీ.. అన్ని సేవలకు యాక్సెస్

ప్రస్తుతం ఒక బ్యాంకులో ఖాతా తెరిచినా, మరో ఆర్థిక సేవ పొందాలన్నా కస్టమర్లు మళ్లీ మళ్లీ గుర్తింపు పత్రాలు, అడ్రెస్ వివరాలు సమర్పించాల్సి వస్తోంది. CKYC 2.0 ద్వారా కస్టమర్ అనుమతి ఇస్తే చాలు.. సెంట్రల్ రిజిస్ట్రీలో భద్రపరిచిన వివరాలను ఆర్థిక సంస్థలు నేరుగా పొందగలవు. దీంతో ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు కస్టమర్లకు సౌకర్యం పెరగనుంది.


డిజిటల్ గుర్తింపు వ్యవస్థకు కొత్త అడుగు

సింగపూర్, యూరప్‌లోని కొన్ని దేశాల్లో ఉన్న డిజిటల్ ఐడెంటిటీ విధానాల తరహాలో భారత్ కూడా ఒకే గుర్తింపు వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేంద్ర కేవైసీ రిజిస్ట్రీలో సుమారు 120 కోట్ల కస్టమర్ రికార్డులు ఉన్నప్పటికీ, డేటా క్వాలిటీ, డూప్లికేషన్, అసంపూర్తి వివరాల కారణంగా వాటి వినియోగం పరిమితంగా ఉంది. కొత్త వ్యవస్థలో ప్రతి రికార్డుకు డేటా ఎంత నమ్మదగినదో తెలిపే కాన్ఫిడెన్స్ స్కోర్ ఉంటుంది. అలాగే ఆ వివరాలను ఏ సంస్థ ధ్రువీకరించిందో కూడా తెలుస్తుంది. కస్టమర్ వన్‌టైమ్ పాస్‌వర్డ్ ద్వారా అనుమతి ఇచ్చిన తర్వాతే ఆర్థిక సంస్థలు ఈ సమాచారాన్ని యాక్సెస్ చేయగలవు.

మోసాల నియంత్రణకు ఉపయోగం

CKYC 2.0 ద్వారా కస్టమర్ వివరాలను సులభంగా పర్యవేక్షించడంతో పాటు ఆర్థిక మోసాలను తగ్గించే అవకాశం ఉందని నియంత్రణ సంస్థలు భావిస్తున్నాయి. ఒకే వ్యక్తి పేరుతో అనేక ఖాతాలు, తప్పుడు గుర్తింపు వివరాలను గుర్తించడం మరింత ఈజీ కానుంది.

మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ రంగాలకు లాభం

ఈ కొత్త విధానం ద్వారా ఆర్థిక ఉత్పత్తుల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ రంగాలకు కొత్త పెట్టుబడిదారులను చేరుకునే అవకాశం లభించనుంది. ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ అధికారులు కూడా ఒకే గుర్తింపు వ్యవస్థ ద్వారా పెట్టుబడిదారుల సంఖ్య భారీగా పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఇప్పటికే బ్యాంకు ఖాతాల వినియోగం విస్తృతమైనప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి రంగాల్లో పాల్గొనడం తక్కువగా ఉంది. CKYC 2.0 అమలుతో ఆర్థిక సేవలను మరింత సులభతరం చేసి, డిజిటల్ ఫైనాన్స్ వాడకాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow