- వెల్లువలా వస్తున్న కొత్త అప్లికేషన్లు
- స్టాఫ్ లేరంటున్న ఉన్నతాధికారులు
- సర్వర్ల సమస్య కూడా..
- 30 వేల అప్లికేషన్లు పెండింగ్
హైదరాబాద్‌సిటీ, : జంట నగరాల్లో కొత్త రేషన్‌కార్డుల జారీ ఆగిపోయింది. మరోవైపు ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నారు. దీంతో కొన్ని వేల అప్లికేషన్లు పౌర సరఫరాల శాఖ వద్ద పెండింగ్‌లో పడిపోయాయి. నెలలు గడుస్తున్నా తమకు రేషన్‌కార్డు రాకపోవడంతో దరఖాస్తుదారులంతా సర్కిల్ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా, అధికారులు ‘దరఖాస్తు చేశారు కదా..త్వరలోనే వెరిఫికేషన్‌కు వస్తాం’ అని తిప్పి పంపుతున్నారు. రేషన్‌కార్డుల జారీ నియంత్రణ ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించగా, హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మాత్రం కొత్త రేషన్‌కార్డుల ప్రక్రియ నిలిచిపోయింది.
సర్కిళ్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో ఫీల్డ్విజిట్చేయలేకపోతున్నామని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఉన్న సిబ్బందిలో చాలామందికి ఎలక్షన్ డ్యూటీలు వేశారని, ఇతర పనులకూ పంపుతుండడంతో ఏం చేయలేకపోతున్నామంటున్నారు. దరఖాస్తులు చాలా వరకూ పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనన్నారు. కానీ, రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయిందనడం సరికాదన్నారు.
సర్వర్ల సమస్య మరో కారణమట..
రేషన్‌కార్డుల జారీ గురించి సర్కిల్ఆఫీసుల్లో సిబ్బందిని అడిగితే సర్వర్ల సమస్య ఉందని అందుకే ఆలస్యమవుతోందని చెప్తున్నారు. అసలు, దరఖాస్తులు రాగానే సంబంధింత సర్కిల్ఏఎస్ఓలు.. ఆర్ఐల ద్వారా ఫీల్డ్లెవెల్పరిశీలన జరిపి అర్హులను గుర్తించాలి. తర్వాత కార్డులు జారీ చేయాలి. కానీ ప్రస్తుతం ఇలాంటి ప్రక్రియ జరగడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు గ్రేటర్‌పరిధిలో 2.40 లక్షల కొత్త రేషన్‌కార్డులు ఇవ్వగా, ప్రస్తుతం 30వేల వరకూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
అన్నింటికీ ఆ కార్డే తప్పనిసరి.
నిజానికి రేషన్‌కార్డు ఇప్పుడు ఎంతో కీలకమైంది. కేవలం రేషన్‌షాపుల్లో సరుకులు తీసుకోవడానికే కాకుండా అన్నింటికీ రేషన్‌కార్డే ప్రామాణికంగా మారింది. కార్పొరేట్దవాఖానల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత సేవలు పొందడానికి, గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్పొందేందుకు, సబ్సిడీ సిలిండర్లను పొందేందుకు రేషన్‌కార్డు కావాల్సి వస్తున్నది. ఇంతే కాకుండా ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకానికి రేషన్‌కార్డునే అడుగుతుండడంతో అంతా దరఖాస్తులు చేసుకుని తిరుగుతున్నారు.