నవాబుపేట : మండలంలో ఆడపిల్ల ల అదృశ్యాల పరంపర కొనసాగుతుండడం అంతు చిక్కడం లేదు. మండలంలో నిత్యం ఏదో ఒక గ్రామంలో ఎవరో ఒకరు అదృశ్యం కావడం గమనార్హం. అదృశ్యమయ్యారని వారికి సంబంధికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, అందుకు సంబంధించిన కేసులు నమోదు కావడం మండలంలో నిత్యకృత్యంగా మారింది. యువతులు అదృశ్యమయ్యారంటే వారు ఏదో ఒక ప్రేమ వ్యవహారంతో ప్రేమికులతో కలిసి వారి వెంట వెళ్లారనుకోవడం సర్వసాధారణం. అయితే మండలంలో యువతులతో పాటు వివాహితలు, కొందరూ చిన్నపిల్లల తల్లులు కూడా అదృశ్యం అవుతుండడం ప్రశ్నార్థకంగా మారింది. చిన్న చిన్న తగాదాలను కూడా భూతద్దంలో చూపెడుతూ మహిళలు తమ కుటుంబాలకు దూరమవుతుండడం ఆ కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది.
గతంలో మండలంలో యువతుల అదృశ్యాలు ఎక్కువగా కనిపించేవి. వారి అదృశ్యాలు తగ్గుముఖం పట్టిన సమయంలో వివాహిత యువతులు, చంటి పిల్లల తల్లులు, వివాహితలు అదృశ్యాలు అధికమవుతున్నాయి. అందుకు పెద్ద కారణాలు మాత్రం ఉండటం లేదు. భర్తలతో ఏ చిన్న మనస్పార్థాలు వచ్చినా స్త్రీలు తమ కుటుంబాలకు దూరంగా వెళ్లిపోతున్నారు. చంటి బిడ్డలు ఉన్నా కూడా నిర్ధాక్షిణ్యంగా వారిని ప్రక్కలోనే వదిలి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు యావత్ మండల ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ సంఘటనలు ఆడపిల్లల సున్నిత స్వభావానికి కారణంగా భావించవచ్చా..? లేక వారి కర్కషత్వానికి పరాకష్టగా భావించవచ్చా అనేది తెలియకుండా ఉంది. ఒకటి రెండు సంవత్సరాలు భర్తలతో కాపురాలు చేసిన వారు వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేక దూరమవుతున్నారంటే అందులో కొంత అర్థం ఉంటుంది. పది, పదిహేను సంవత్సరాలు భర్తలతో కాపురాలు చేసి ఇద్దరు, ముగ్గురు సంతానం కలిగి ఉన్న వారు సైతం తమ కుటుంబాలకు దూరమవుతుండడం విడ్డూరంగా కనిపిస్తోంది.
తాజాగా శనివారం నవాబుపేట మండలంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ కేసుల దర్యాప్తు పోలీసులకు తలనొప్పిగా మారింది. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో తలమునకలై ఉండే పోలీసులకు ఈ కేసుల దర్యాప్తు అదనపు భారంగా మారింది. మండల పరిధిలోని హన్మసానిపల్లి గ్రామానికి చెందిన నిర్మలమ్మ(36) గత నెల 18న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. 15 సంవత్సరాల క్రితం ఆమెకు గ్రామానికి చెందిన చెన్నారపు మల్లయ్యతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం కలిగారు. సంసారం విషయంలో మల్లయ్య, నిర్మలమ్మ తరచూ గొడవ పడేవారు. తన కూతురు అక్షిత, భర్త మల్లయ్య ఇంట్లో నిద్రకు ఉపక్రమించగానే వారిని అక్కడే వదిలేసి నిర్మలమ్మ అక్కడి నుండి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆరోజు నుంచి ఆమె కోసం ఎంతగా వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో విసిగి వేసారిన మల్లయ్య శనివారం తన భార్య నిర్మలమ్మ ఆచూకీ కనుగొని తనకు అప్పగించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విక్రమ్ తెలిపారు.