,
జడ్చర్ల : భారీ వర్షం వల్ల ఏర్పడ్డ భారీ నీటి ప్రవాహం లో
కొట్టుకుపోయిన వృద్ధ దంపతుల మృతదేహాల వెలికితీత చర్యలను మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి శుక్రవారం ప్రత్యేకంగా పరిశీలించారు. జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో గురువారం భారీ వర్షం కురిసిన నేపథ్యంలో పోతిరెడ్డి చెరువుకు భారీ వరద నీరు వచ్చి అలుగు పారింది. ఈ క్రమంలో అంబఠాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య (70) రాములమ్మ(60) దంపతులు వరద ఉధృతిలో గల్లంతైన విషయం తెలిసిందే. గురువారం రాత్రి నుంచి రిస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు బైకు పై బయలుదేరారు. అక్కడికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మోటార్ సైకిల్ పై చేరుకున్నారు. ఈ సందర్భంగా గాలింపు చర్యలను గురించి స్వయంగా పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. గల్లంతైన దంపతుల గుర్తింపు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయని.. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నప్పుడు వాగులు వంకలతో పాటు రోడ్లు అన్నీ పొంగిపొర్లుతాయని గ్రామస్తుల ద్వారా తెలిసింది. అవసరమైన చోట్ల హై లెవెల్ బ్రిడ్జిల్లా నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టుగా ఆమె తెలిపారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో రాకపోకలు సాగించకుండా అధికారులు ఎప్పటికప్పుడు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గల్లంతైన వారి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఉండవలసిన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయేంద్ర బోయి చెప్పారు. పరిస్థితులను పరిశీలించేందుకు కలెక్టర్ మోటార్ సైకిల్ పై రావడం సర్వత్ర చర్చనీయాంశం అయింది.
