Jubilee Hills: ఛాన్స్ కొట్టేసిన నవీన్‌యాదవ్.. భగ్గుమన్న అసంతృప్తి, అలకలు స్టార్ట్.. ముంగిట పడేదెట్లా..!
జూబ్లీహిల్స్ ఉప సమరం వేళ... అభ్యర్థిని ప్రకటించేదాకా ఒక ఎత్తు.. అభ్యర్థిని ప్రకటించాక మరో ఎత్తన్నట్టు.. ఉడుకు పుట్టించే సిసలైన ఎలక్షన్ ఎపిసోడ్ ఇప్పుడే షురూ అయింది. అధికార పార్టీగా ప్రత్యర్థుల కన్నా ముందుండాల్సిన పార్టీని... ఈ కలహాలు వెనక్కి లాగుతాయా? అంతా సెట్‌రైట్ చేసేందుకు హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించి.. ముందుకు నడిపిస్తాయా?
కయ్యాలకు కేరాఫ్‌గా నిలిచే కాంగ్రెస్‌లో అసలు కథ ఇప్పుడే మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప సమరం వేళ… అభ్యర్థిని ప్రకటించేదాకా ఒక ఎత్తు.. అభ్యర్థిని ప్రకటించాక మరో ఎత్తన్నట్టు.. ఉడుకు పుట్టించే సిసలైన ఎలక్షన్ ఎపిసోడ్ ఇప్పుడే షురూ అయింది. అధికార పార్టీగా ప్రత్యర్థుల కన్నా ముందుండాల్సిన పార్టీని… ఈ కలహాలు వెనక్కి లాగుతాయా? అంతా సెట్‌రైట్ చేసేందుకు హైకమాండ్ చేస్తున్నr ప్రయత్నాలు ఫలించి.. ముందుకు నడిపిస్తాయా? ఇప్పుడే హాట్ టాపిక్‌గా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో.. ఇప్పుడు అందరి దృష్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికవైపు మళ్లింది. బస్తీమే సవాల్ అన్నట్టుగా.. ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ఉపసమరానికి సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇక్కడ మాగంటి సునీత పేరు ప్రకటించి, అభ్యర్థి విషయంలో బీఆర్‌ఎస్ ఒకడుగు ముందుండగా.. కాస్త లేటైనా మల్లగుల్లాలు పడి నవీన్ యాదవ్‌ను క్యాండిడేట్‌గా కన్ఫామ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక, బీజేపీ సైతం అదే పనిలో బిజీగా ఉంది. ఏ క్షణమైనా.. తమ అభ్యర్థిని కన్ఫామ్ చేసేందుకు చర్చోపచర్చలు జరుపుతోంది.
అవన్నీ పక్కనపెడితే… కాంగ్రెస్‌లో అప్పుడే కల్లోలం మొదలైపోయింది. అంతా సవ్యంగా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకవుతుంది? అందుకే అసలు సిసలు జగడం ఇప్పుడే ముదిరినట్టు కనిపిస్తోంది. టిక్కెట్ విషయంలో ఆశలు పెట్టుకున్న నాయకుల సంఖ్య.. అంతకంతకూ పెరిగిపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎవరికివారు తమస్థాయిలో విశ్వప్రయత్నాలు చేసినా… చివరికి అవకాశం మాత్రం లోకల్ లీడర్ నవీన్ యాదవ్‌కు దక్కింది. దీంతో, ఒక్కసారిగా అసంతృప్తి భగ్గుమంది. అలకలు మొదలైపోయాయి.
ఈ సీటు విషయంలో మొదట్నుంచీ పట్టుబడుతున్న మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్.. తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని పార్టీ పెద్దలకు తేల్చి చెప్పారు. అయితే, ఇప్పుడు తనను కాదని, ఏడాది కింద పార్టీలో చేరిన నవీన్‌యాదవ్‌కు టిక్కెట్ కన్ఫామ్ చేయడం… అంజన్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో, రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు… ఆయనను బుజ్జగించేపనిలో నిమగ్నమయ్యారు. మంత్రులు పొన్నం, వివేక్‌లతో పాటు.. ఇంచార్జ్ నటరాజన్ కూడా అంజన్ నివాసానికి వెళ్లి బతిమాలాల్సి వచ్చింది. తనను అవమానించారంటూ.. అంతెత్తున కోపంతో అంజన్ ఎగిరిపడ్డప్పటికీ, పార్టీ లైన్ దాటిపోనంటూ చెప్పడం కొసమెరుపు.
జూబ్లీహిల్స్‌లో గల్లీ గల్లీకో లీడర్… ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఊహించుకున్నారంటే అతిశయోక్తి కాదు. రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మరో బీసీ నేత మురళీగౌడ్, మరో మాజీ కార్పొరేటర్… ఇలా ఒక్కరేంటి, కండువా వేసుకున్నోడల్లా అభ్యర్థిగా ఫీలైపోయారు. ఆ స్థాయిలో బ్యానర్లు కట్టేసుకుని హడావుడి చేశారు. ఇప్పటికే ఇక్కడ గెలుపు బాధ్యతలను, ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రులు పొన్నం, వివేక్‌లకు… అలాంటి నాయకులను సముదాయించడమే పనిగా మారిపోయింది. వరసబెట్టి అందరి ఇళ్లకూ వెళ్తున్న మంత్రులు.. బాబూ గొడవలొద్దు.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉందామంటూ అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎలాగూ స్థానిక ఎన్నికలు కూడా లేవు కాబట్టి… ఇక మొత్తంగా జూబ్లీహిల్స్ బైపోల్ మీదే ఫోకస్ పెట్టి విజయం సాధించాలనుకుంటున్న అధికార కాంగ్రెస్‌కు… ఈ నేతల అసంతృప్తి తలనొప్పిగా మారేలా ఉంది. బుజ్జగింపులతో నేతలు అలకవీడినా అభ్యర్థి నవీన్ యాదవ్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తారా? అన్నదే అనుమానాలకు తావిస్తోంది. బీసీ కార్డును తెరమీదకు తీసుకొచ్చిన కాంగ్రెస్.. అందుకు తగ్గట్టే యాదవ వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టింది.2014 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ తరఫున పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంతో నిలిచిన నవీన్ యాదవ్.. 2018లో కేవలం 18,817 ఓట్లతో సరిపెట్టుకున్నారు. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినా అప్పుడు టిక్కెట్ దక్కలేదు. ఇప్పుడు మాగంటి మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో.. అనూహ్యంగా దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. మరి, హేమాహేమీలను కాదని.. సీటు దక్కించుకున్న నవీన్ యాదవ్… అంత వీజీగా విజయం సాధిస్తారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బీసీ కార్డు పరంగా చూసినా.. యాదవుల ఓట్లు జూబ్లీహిల్స్‌లో పదిహేనువేలకు మించిలేవు. BRS కంచుకోటలా మారిన ఈ స్థానంలో.. మిగితా బీసీ వర్గాలన్నీ గంపగుత్తగా నవీన్ యాదవ్ వెంట నిలుస్తాయనీ చెప్పలేం. ఒకవేళ ఎంఐఎం మద్దతునిస్తుందనుకున్నా… లక్ష వరకూ ఉన్న ముస్లిం ఓట్లు.. పూర్తిస్థాయిలో టర్నవుతాయనీ బలంగా అంచనావేయలేని పరిస్థితి. ఓవైపు సింపతీ యాంగిల్‌లో మాగంటి కుటుంబం ఇప్పటికే జనంలోకి దూసుకెళ్తోంది. బీజేపీ సైతం టఫ్ ఫైట్ ఇచ్చేందుకు సై అంటోంది. ఈ ఈక్వెషన్స్ అన్నీ ఒకెత్తయితే.. కలహాల కాంగ్రెస్‌లో ఎన్నికలవేళ అంతా కలిసి పనిచేయడమన్నది మరో ఎత్తు. మరీ ఈ ఎత్తుల్ని నవీన్‌యాదవ్ ఎలా అధిగమిస్తారనేదే ఆసక్తికర అంశం.
