అర్హులైన జర్నలిస్టులకే అక్రెడిటేషన్కార్డులు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు ఐఅండ్‌పీఆర్(సమాచార పౌరసంబంధాల శాఖ) అధికారులు గండికొడ్తున్నారు. పత్రికల సర్క్యులేషన్ ఆధారంగానే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని పైస్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాల్లో డీపీఆర్వోలు అమలుచేయడం లేదు. -ఒక్క కాపీ ముద్రించని ఆన్ లైన్ పత్రికలకూ ఇష్టారాజ్యంగా కార్డులు జారీ చేస్తున్నారు.
చార్టెడ్ అకౌంటెంట్ల పేరుతో జారీ చేసిన ఫేక్ సర్క్యులేషన్ సర్టిఫికెట్లు, డబ్బులు తీసుకొని ఊరూపేరూ లేని పేపర్లకు కార్డులు కట్టబెడ్తున్నారు. సర్క్యులేషన్‌కు సంబంధించి కీలకమైన పీఆర్జీఐ (ప్రెస్రిజిస్ట్రార్ జనరల్ఆఫ్ ఇండియా) సర్టిఫికెట్ ఉన్న ‘వెలుగు’ లాంటి దినపత్రికలో పనిచేసే మండల విలేకరులకు అక్రెడిటేషన్కార్డులు ఇవ్వకుండా సతాయిస్తున్నారు.
బిగ్ పేపర్స్ కేటగిరీలో అక్రమంగా ఎంట్రీ..
ఆయా న్యూస్పేపర్ల సర్క్యులేషన్‌ను బట్టి గతంలో ‘వెలుగు’ సహా నాలుగైదు దినపత్రికలు మాత్రమే ‘బిగ్ పేపర్స్’ కేటగిరీలో ఉండేవి. ప్రస్తుతం ఐఅండ్‌పీఆర్ ఆఫీసీర్లు బిగ్ పేపర్స్ లిస్టులో వెయ్యి సర్క్యులేషన్ కూడా లేని పలు పత్రికలను యాడ్ చేశారు. దాదాపు 17 పత్రికలతో ఈ లిస్టును ఇటీవల విడుదల చేశారు. అందులో సింగిల్ కాపీ కూడా ప్రింట్చేయని ఆన్ లైన్ పత్రికలూ ఉన్నాయి.
ఆన్ లైన్ పేపర్లకు వందల కొద్దీ సర్క్యులేషన్ఉన్నట్టు ఫేక్సీఏ(చార్టెడ్అకౌంటెంట్) సర్టిఫికెట్లు ఇవ్వగానే కనీసం వెరిఫై చేయకుండా గుడ్డిగా కార్డులు జారీ చేశారు. ఇలా ప్రతి జిల్లాలో ఆన్ లైన్ పత్రికలకు 180 నుంచి 250 కార్డుల వరకు అక్రమంగా ఇచ్చేశారు. కానీ ‘వెలుగు’ పత్రికకు ‘పీఆర్జీఐ సర్టిఫికెట్’ ఉన్నప్పటికీ సీఏ సర్టిఫికెట్లు తేవాలని వేధిస్తున్నారు. సీఏ సర్టిఫికెట్లు ప్రచురణ కేంద్రాల వద్దే ఇస్తారనే కనీస జ్ఞానం లేని ఐఅండ్పీఆర్ఆఫీసర్లు పెట్టిన నిబంధన వల్ల ఫేక్సర్టిఫికెట్లు తేలేక ‘వెలుగు’ విలేకరులు అక్రెడిటేషన్కార్డులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘వెలుగు’ పత్రికకు కార్డులు ఇవ్వాలని కలెక్టర్లు, అక్రెడిటేషన్ కమిటీలు తీర్మానం చేసినా.. పలువురు డీపీఆర్వోలు పెడచెవిన పెడుతున్నారు. ఉత్తర తెలంగాణ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడి డీపీఆర్వోలు ‘వెలుగు’లో పని చేస్తున్న మండల విలేకర్లకు రెండు వారాల కిందటే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేశారు. కానీ దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ఉన్న డీపీఆర్వోలు.. కార్డులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు.