మహబూబ్​నగర్​ దశ తిరిగేనా? - వందల ఎకరాల్లో గుడిబండలో డ్రైపోర్టు? - DRY PORT IN TELANGANA


 Dry Port in Mahabubnagar : పాలమూరులో సాగునీటి ప్రాజెక్టులతోపాటు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహబూబ్​నగర్​ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండలో డ్రై పోర్టు ఏర్పాటునకు కసరత్తు జరుగుతోంది. దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని గుడిబండ శివారు సర్వే నంబరు 118లోని సుమారు వంద ఎకరాలకు పైగా స్థలం ఉంది. ఈ భూముల్ని ఇటీవల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) అధికారుల బృందం, ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి పరిశీలించారు.

ఓడ రేవులకు అనుసంధానంగా డ్రైపోర్టులు : వ్యాపార, వాణిజ్య కార్య కలాపాలు వేగంగా నిర్వహించేందుకు సరుకుల దిగుమతి, ఎగుమతుల్లో రవాణా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓడ రేవుల నుంచి వచ్చే సరుకును భారీ కంటైనర్లలో రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఒక ప్రదేశంలో నిల్వ చేసి సకాలంలో గమ్యస్థానాలకు చేరవేసేందుకు వీలుగా డ్రై పోర్టులను, లాజిస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఓడ రేవులకు అనుసంధానంగా ఉండే డ్రైపోర్టుల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. నౌకాశ్రయాలలోని రద్దీని తగ్గించడంతో పాటు ఖర్చు, సమయం ఆదా అవుతుంది. తరలింపునకు మార్గం సుగమం అవుతుంది.

అన్నింటికీ అనువైన ప్రాంతం: గుడిబండ గ్రామం నేషనల్​ హైవే-44 కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్​కు వంద కిలోమీటర్లే. కర్నూలు, బెంగళూరు వెళ్లే మార్గం కూడా ఇదే. పైగా కర్ణాటకలోని రాయచూర్​కు వెళ్లే జాతీయ రహదారి - 167 కు సమీపంలో ఉండటంతో రవాణా సులభంగా చేసుకోవచ్చు. తెలంగాణ నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లేందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. మహబూబ్​నగర్, మదనాపురం, దేవరకద్ర ప్రాంతాల నుంచి రైలు మార్గం కూడా అందుబాటులో ఉంది.

ఆర్థికంగా, పారిశ్రామికంగా వృద్ధి : పరిశ్రమలు ఏర్పడితే స్థానికులకు ఉపాధి లభించడంతోపాటు ఆ ప్రాంతం ఆర్థికంగా, పారిశ్రామికంగా వృద్ధి చెందుతుంది. ఇక్కడ డ్రైపోర్టు రానుండటంతో యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉపాధి లభించే అవకాశాలున్నాయి. దేవరకద్ర మండలం చౌదర్​పల్లి - బస్వాయిపల్లి వద్ద బ్రహ్మోస్​ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తుంది. అన్నీ అనుకూలించి ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే పాలమూరు ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

వలసలు అరికట్టవచ్చు : పాలమూరును అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తేనే వలసలు అరికట్టవచ్చని దేవరకద్ర ఎమ్మెల్యే మదుసూదన్​రెడ్డి అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో డ్రైపోర్టు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి గుడిబండలో ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

"పాలమూరును అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తేనే వలసలు అరికట్టవచ్చు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలనే ప్రధాన లక్ష్యం డ్రైపోర్టు ఆలోచన చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి గుడిబండలో ఏర్పాటుకు కృషి చేస్తున్నాం."

- మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే దేవరకద్ర

Previous Post Next Post

نموذج الاتصال