టెండర్ల పేరుతో మత్స్య కారులకు మళ్లీ అన్యాయమే

 



మహబూబ్ నగర్ : టెండర్ల పేరుతో మత్స్యకారులకు మరోసారి అన్యాయమే జరుగుతుందనీ, సొసైటీ అకౌంట్లో నగదు జమ చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కోసం మత్స్య శాఖ ఫెడరేషన్ ద్వారా ఈ ఏడాది రూ. 122 కోట్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఉచిత చేప, రొయ్య పిల్లలను టెండర్లు ద్వారా పంపిణీ కాకుండా ప్రతి సొసైటీ అకౌంట్లలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ విధానాల మాదిరిగానే టెండర్లను పిలిచి కాంట్రాక్టర్లకు ఇస్తే అవినీతికి అవకాశం ఉంటుందని, ఇప్పుడు మరో మార్గంలో దళారీ వ్యవస్థను తీసుకొస్తున్నారనీ, ఇది దొంగకు తాళం చేతులు ఇచ్చే విధంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మత్స్య సొసైటీలకు జరిగిన పంపిణీలో కేవలం 30 శాతం మాత్రమే క్రింది స్థాయిలో గ్రౌండ్ అయిందనీ, 70 శాతం అవినీతి జరిగిందని, ఆ విధానాన్ని విమర్శిస్తూనే పాత ఒరవడిలో కొనసాగటం కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. మత్స్యకారులు నేరుగా వృత్తిలో ఉపాధి పొందేందుకు, నేరుగా సొసైటీ ఖాతాలో నగదు జమ చేయడం వల్ల 100 శాతం మత్స్య సొసైటీలు లబ్ది పొందుతాయని తెలిపారు. కేటాయించిన పూర్తి బడ్జెట్ ను ప్రతీ మత్స్య సొసైటీ పరిధిలో ఉన్న జలవనరులకు సరిపడేంత చేప, రొయ్య పిల్లలకు అయ్యే ఖర్చును మత్స్యకారుల సొసైటీల అకౌంట్లలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال