హైదరాబాద్: మహా నగరంలో ఇవాళ(మంగళవారం) భారీ దోపిడీ జరిగింది. చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ షాపులో కొంతమంది దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఒక్కసారిగా దుకాణం లోపలికి ప్రవేశించిన దొంగలు తుపాకులతో బెదిరింపులకు దిగారు. అక్కడున్న సిబ్బంది బెదిరించి పెద్దఎత్తున నగలు ఎత్తుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా.. కాల్పులకు తెగపడ్డారు.
షాపు డిప్యూటీ మేనేజర్ కాళ్లపై రెండు రౌడ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఈ దాడిలో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. అనంతరం సీసీ కెమెరాలపైనా కాల్పులు జరిపారు. షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే భారీ దోపిడీకి పాల్పడి అక్కడ్నుంచి హుడాయించారు కేటుగాళ్లు. షాపు సిబ్బంది, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే, దోపిడీ అనంతరం దుండగులంతా జహీరాబాద్ వైపు పారిపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు జిల్లా సరిహద్దు పోలీసులను అలర్ట్ చేశారు.
కాగా, నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ సీపీ వెల్లడించారు. KPHPలో దోపిడీకి పాల్పడిన ముఠానే ఖజానా జ్యువెలర్స్‌లోనూ కాల్పులు జరిపి దొంగతనం చేసినట్లు తెలిపారు. KPHPలో 20 తులాల బంగారం, రూ.3లక్షలను ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. కాగా, ఖజానా జ్యువెలర్స్‌లో భారీగానే గోల్డ్ చోరీ అయినట్లు తెలుస్తోంది.