మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు ఎగువన కురిసిన వర్షాలకు వరదల తాకిడి ఎక్కువ కావడంతో పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ రహదారులు లేక బిక్కుబిక్కుమంటూ వరద నీటిలోనే రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు గత వారం రోజులుగా మహబూబ్నగర్ జిల్లాలో వాగులు, వంకలు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ రంగనాయక స్వామి పెద్ద చెరువు పూర్తిగా నిండి వరద నీరు రహదారి మీదుగా ప్రవహిస్తుండడంతో పోలేపల్లి నుండి కిష్టారం, ఖానాపూర్, దొడ్డిపల్లి కూచూరు నవాబుపేట తదితర గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు పోలేపల్లి పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికులు కూడా ఇక్కడనుండి నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు. వరద తీవ్రతతో ప్రమాదం అని తెలిసిన కూడా ప్రత్యాన్మాయ రహదారులు లేక నీటి ప్రవాహంలోనే రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. నిరంతరం కురుస్తున్న వర్షాలతో మూడింతల నీరు, ఒకింత ఊరు లాగా మారిపోయింది పోలేపల్లి పరిస్థితి. ప్రతిఏటా వర్షాలు కురిసే సమయంలో నిత్యం ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వరదల ఉధృతికి పంట పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయాయని ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags
Jadcherla