ఇందిరమ్మ ఇంటికి ఇసుక ఉచితం!

jayyapal jvs media
1 minute read

 ఒక్కో ఇంటికి 37-40 టన్నులు అవసరం.. పూర్తి ఉచితంగా ఇవ్వాలని సర్కారు యోచన?

4.50 లక్షల ఇళ్లకు 112 లక్షల క్యూబిక్‌ మీటర్ల

ఇసుక కావాల్సి ఉంటుందని అంచనా

ఒక్కో ఇంటికి అదనంగా రూ.60 వేలు వెచ్చించనున్న ప్రభుత్వం!


రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త సంవత్సర కానుక ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు పొందిన లబ్ధిదారులకు సిమెంటు, ఇనుమును సంబంధిత కంపెనీలతో మాట్లాడి, తక్కువ ధరకే అందించాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం.. తాజాగా ఇసుకను ఉచితంగా అందించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వాస్తవానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రకటించినప్పుడు కేవలం సొంత స్థలం ఉన్నవారు ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు, స్థలం లేని వారికి స్థలమిచ్చి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పింది.  కానీ, ప్రస్తుత పరిస్థితులు, ఇంటి నిర్మాణంలో కీలకమైన ఇసుక, ఇనుము, సిమెంటు ధరలు మార్కెట్‌లో చుక్కలనంటుతున్న నేపథ్యంలో సిమెంటు, ఇనుమును తక్కువ ధరకు అందించాలనే యోచనకు వచ్చింది. ఇసుకను మాత్రం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఒక్కో ఇంటికి ఎంత మేర ఇసుక అవసరమనే అంశాన్ని చెబుతూ గృహ నిర్మాణ సంస్థ పంపిన ప్రతిపాద నలపై ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ఈ మేరకు ఒక్కో ఇంటికి 25 క్యూబిక్‌ మీటర్ల ఇసుక (దాదాపు 37-40 టన్నులు) అవసరం అవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసే మొత్తం 4.50 లక్షల ఇళ్లకు 112 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందించే అంశంపై ప్రభుత్వం ఖనిజాభివృద్ధి సంస్థతో చర్చించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఇసుక లభ్యమవుతోంది? ఎంత ధర ఉంది? అనే వివరాలను సేకరిస్తోంది.


కాగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో టన్ను ఇసుక ధర రూ.1400-1500 వరకు పలుకుతోంది. ఇందులోనూ రకాలున్నాయి. ఈ ధరలు ప్రాంతాలు, డిమాండ్‌ను బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు ఖమ్మంలో టన్ను ఇసుక ధర రూ.1400 పలికితే.. అదే హైదరాబాద్‌లో రూ.1600-1700 వరకు పలుకుతోంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నప్పుడు ఇదే ఇసుకను టన్ను రూ.2200-2400 వరకు కూడా విక్రయించామని ఒక ఇసుక వ్యాపారి ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. ఒక్కో ఇంటికి దాదాపు 37-40 టన్నుల ఇసుక అవసరమవుతుంది. దీని ప్రకారం టన్ను ధర సగటున రూ.1500 అనుకుంటే.. ఒక్కో ఇంటికి ప్రభుత్వం అదనంగా రూ.60 వేల వరకు వెచ్చించాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెంలో రెండు ర్యాంపుల్లో, ములుగు జిల్లాలో ఒకట్రెండు, కాళేశ్వరం దగ్గర ఉన్న ర్యాంపుల్లో ఇసుక అందుబాటులో ఉంది.

Tags
Chat