పెద్ద(జిల్లా) ఆసుపత్రిలో చి(ల్లర)న్న దొంగలు
👉 ఆసుపత్రి ఆవరణలో భర్త ,ఆసుపత్రి లోపల భార్య దొంగతనం
👉 రోగం వచ్చిందంటూ ఆసుపత్రిలో అడ్మిట్ అయి మరీ చోరీలకు పాల్పడుతున్న భార్యాభర్తలు
👉 సిబ్బంది గమనించకపోతే జేబులు ఖాళీ
ఉపాధి ఒక్కరు చేస్తే సరిపోదనుకున్నారేమో భార్యాభర్తలు?. ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేయొచ్చు,ఒకే ఇంట్లో భార్యాభర్తలు రాజకీయం చేయొచ్చు, దొంగతనాలు భార్యాభర్తలు చేస్తే తప్పేమి అనుకుని ఉండొచ్చు బహుశ.జోగులాంబ గద్వాల జిల్లా ఆసుపత్రిలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దొంగతనాలకు పాల్పడుతుండగా పట్టుకున్నారు ఆసుపత్రి సిబ్బంది,రోగి బంధువులు.గొడ్డోడు గొడ్డుకు ఏడిస్తే కొవ్వోడు కొవ్వుకు ఏడ్చిండు అన్న చందంగా ఆరోగ్యాలు బాలేక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే ఆసుపత్రికి వచ్చిన వారి జేబులు ఖాళీ చేస్తున్నారు భార్యాభర్తలు.చీకటి అయ్యాక కడుపునొస్తుందని లేబర్ రూంలో భార్య వెళ్లి ఉండగా,చేతికి గాయం అయ్యింది కట్టు కట్టండి అంటూ భర్త క్యాజువాలిటి దగ్గర వేషాలు వేసారు. ఆసుపత్రికి వచ్చారంటేనే ఆపదలో వచ్చి వుంటారనుకున్న సిబ్బంది ఇద్దరికి చికిత్స ప్రారంభించారు.అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో ఆసుపత్రిలో అందరి బుడ్డి ఆరిపోయాక(పడుకున్నాక) భార్యాభర్తలు జేబులు ఖాళీ చేసే పనిలో పడ్డారు. భర్త ఆసుపత్రి ఆవరణలో ఉన్న వైర్లను,చిన్న చిన్న సామగ్రిని దొంగలిస్తుండగా,భార్య ఇటు ఆసుపత్రి లోపల రోగి బంధువులు అలసిపోయి పడుకున్న వారి జేబులు ఖాళీ చేసింది.సడన్ గా సామాగ్రి ఎత్తుకెళ్ళి బయట పడేస్తుండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది అటుగా భర్తను ప్రశ్నిస్తుండగా,ఇటు రోగి బంధువు జేబులో ఉన్న 800 రూపాయలు భార్య ఎత్తేసిందట.సుమారు గంటకు పైగా ఆమెను అడగగా 400 రూపాయలు లభ్యమైనట్టు తెలిసింది.భార్యభర్తలది అనంతపురం జిల్లా కమలానగర్ కు చెందినవారని తెలిసింది.