బోయిన్‌పల్లి మార్కె
ట్‌లో పాడైన కూరగాయలతో కరెంట్, గ్యాస్ ఉత్పత్తి.
- నిత్యం 10 టన్నుల కూరగాయల వ్యర్థాలు
- ఎనర్జీ ప్లాంట్ ద్వారా 400- 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
- మార్కెట్ అవసరాలకు వినియోగం
హైదరాబాద్: గ్రేటర్‌లో హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌గా పేరుగాంచిన బోయిన్‌పల్లి మార్కెట్(Boinpally Market) వ్యర్థాలకు కొత్త అర్థం చెబుతోంది. నిత్యం వేలాది టన్నుల కూరగాయలు క్రయవిక్రయాలు జరుగుతున్న ఈ మార్కెట్‌లో నిత్యం 10 టన్నుల వరకు వ్యర్థాలు పోగవుతుంటాయి. వీటిని వృథా చేయకుండా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌కు తరలించి 400-500 యూనిట్ల కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా ఉత్పత్తి అయిన కరెంటును మార్కెట్‌యార్డులో వీధిలైట్లు, క్యాంటీన్, మార్కెటింగ్ కార్యాలయం, టర్నింగ్ సెంటర్, నీటి సరఫరా కోసం వినియోగిస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం రూ.3 కోట్ల వ్యయంతో అహుజా ఇంజినీరింగ్ సర్వీస్ (ఏఈఎస్) మార్కెట్ ప్రాంగణంలో ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌లో కూరగాయల వ్యర్ధాలను వేరు చేయడం, యంత్రాలను ఆపరేట్ చేయడం చేస్తారు. నిత్యం మార్కెట్‌కు వచ్చే కూరగాయల వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఈ ప్లాంట్‌కు తరలిస్తారు. ప్రస్తుతం ప్లాంటులో ఒక సూపర్‌వైజర్‌తోపాటు 9 మంది సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తూ కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. నిత్యం 650-700 యూనిట్లు అవసరం
బోయిన్‌పల్లి మార్కెట్‌కు నిత్యం 650-700 యూనిట్ల విద్యుత్ అవసరం. ప్రస్తుతం కూరగాయల వ్యర్థాల ద్వారా 400-500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ సొంతానికి వినియోగిస్తున్నారు. ఫలితంగా మార్కెట్ శుభ్రంగా, కాలుష్యరహితంగా ఉంటోంది. వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ప్లాంట్‌ను సందర్శించి అభినందించారు. బోయిన్‌పల్లి వెజిటబుల్ మార్కెట్(Boinpally Vegetable Market) అమలు చేస్తున్న వినూత్న వ్యర్ధ పదార్ధాల నిర్వహణను ప్రధాని నరేంద్రమోదీ దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈ ప్లాంట్ గురించి ప్రశంసించారు.
కరెంటే కాదు.. గ్యాస్ ఉత్పత్తి కూడా
మార్కెట్‌లో ఎనర్జీ ప్లాంట్‌తోపాటు బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిద్వారా నిత్యం 40 కేజీల నుంచి 50 కేజీల గ్యాస్ ఉత్పత్తి అవుతున్నది. ఈ గ్యాస్‌ను మార్కెట్ వాణిజ్య వంటగది, క్యాంటీన్ అవసరాలకు వినియోగిస్తున్నారు.
నిత్యం 10 టన్నుల వ్యర్ధాలు
ప్రతిరోజూ 10 టన్నుల కూరగాయల వ్యర్ధాలతో 400 నుంచి 500 యూనిట్ల కరెంటును ఉత్పత్తి చేస్తున్నాం. 40 నుంచి 50 కేజీల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. 400 యూనిట్ల కరెంట్‌లో 150 యూనిట్లు మార్కెట్‌యార్డు వీధిదీపాలకు, 150 యూనిట్లు మార్కెట్ కార్యాలయానికి, ట్రైనింగ్ సెంటర్‌తోపాటు క్యాంటీన్ అవసరాలకు వినియోగించగా మిగిలిన 100 యూనిట్ల కరెంట్‌ను రీసైక్లింగ్‌కు వినియోగిస్తున్నాం.
- బాలరాజు, ప్లాంట్ సూపర్‌వైజర్
కరెంటు బిల్లు తగ్గింది..
10 టన్నుల వ్యర్ధాలు ఏడాదికి సుమారు 6,290 కిలోల కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ సమస్యను అధిగమించేందుకు వ్యర్ధాలను ఇంధనంగా మార్చుతున్నాం. గతంలో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు కరెంట్ బిల్లు వచ్చేది. కానీ ఈ ప్లాంట్ ద్వారా ప్రస్తుతం రూ.లక్షకు మించడం లేదు.