జెండాలు వేరైనా అజెండా అభివృద్ధే కావాలి
• ఎన్నికల్లో గెలిచేవరకే రాజకీయాలు చేయాలి
• జడ్చర్ల సమగ్రాభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలి
• అమృత్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పిలుపు
జడ్చర్ల, అక్టోబర్ 23: ఎన్నికల్లో గెలిచేవరకే రాజకీయపార్టీలను గురించి మాట్లాడాలని, గెలిచాక పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధి కోసం కలిసి రావాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కోరారు. జెండాలు వైరైనా అందరి అజెండా జడ్చర్ల అభివృద్ధే కావాలని పిలుపు నిచ్చారు.
జడ్చర్ల పట్టణంలో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చడం కోసం రూ.47 కోట్లతో చేపట్టిన అమృత్ పథకానికి బుధవారం అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, జడ్చర్లలో తాగు నీటి కొరత ఉందనే విషయం తన దృష్టికి కూడా వచ్చిందని చెప్పారు. మిషన్ భగీరథ లో తరచుగా తలెత్తున్న సాంకేతిక సమస్యలతో తాగు నీటి సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయని, ఇటీవల దసరా పండుగ సమయంలోనూ పట్టణ వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో మోటార్లు మారిస్తే తప్ప నీటి సరఫరా మెరుగుపడదని, దాని కోసం కావాల్సిన రూ.3 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కోరామన్నారు. ప్రస్తుతం జడ్చర్లలో రూ.47 కోట్లతో అమలు చేస్తున్న అమృత్ పథకంలో రూ.20 కోట్లు కేంద్ర ప్రభుత్వానివి కాగా రూ.27 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానివని వివరించారు. ఈ పథకంలో భాగంగా 56 కి.మీ. పొడవైన తాగు నీటి పైప్ లైన్లను ఏర్పాటు చేస్తారని, ఎర్రగుట్ట, నిమ్మబావిగడ్డ, సిగ్నల్ గడ్డ, క్లబ్ రోడ్, బ్రహ్మంగారి గుడి, జాతీయ రహదారి సమీపాల్లో 5 లక్షల నుంచి 15 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ట్యాంకులను నిర్మిస్తారని అనిరుధ్ రెడ్డి వివరించారు. దీనివల్ల జడ్చర్ల పట్టణంలో 58 లక్షల లీటర్ల తాగు నీటి సామర్థ్యం పెరుగుతుందన్నారు. పట్టణంలో మొత్తం 7954 నల్లాల ద్వారా ఈ నీటిని ప్రజలకు అందిస్తారని చెప్పారు. రాబోయే వేసవి నాటికి ఈ పనులన్నీ పూర్తవుతాయని, దీంతో జడ్చర్లలో తాగు నీటి సమస్య శాశ్వితంగా తీరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇది కాకుండా జడ్చర్ల పట్టణంలో వర్షపు నీటిని మళ్లించే డ్రైన్లు, 27 వార్డుల్లోనూ సిమెంటు రోడ్ల నిర్మాణానికి రూ.22 కోట్లు ఇటీవలే మంజూరు చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఈ పనులన్నింటినీ ఓపెన్ టెండర్ల ద్వారానే పూర్తి చేయించడం ద్వారా వాటిలో నాణ్యత తగ్గకుండా చూస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జడ్చర్ల మున్సిపాల్టీకి కోట్లాది రుపాయలు మంజూరైనట్లు జీవోలు వచ్చినా వాటికి సంబంధించిన పనులు మాత్రం జరగలేదని విమర్శించారు. ప్రస్తుతం మంజూరైన నిధులు కాకుండా మరో రూ.70 కోట్ల పనులు మంజూరుకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఈ నిధులు కూడా వస్తే జడ్చర్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఎన్నికల్లో గెలిచే వరకే ఎవరైనా రాజకీయాల గురించి చూసుకోవాలని, గెలిచిన తర్వాత తమ పార్టీ జెండా ఏదైనా అందరి అజెండా కేవలం అభివృద్ధి మాత్రమే కావాలని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జడ్చర్లను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు కూడా నియోజకవర్గ అభివృధ్ధి కే ప్రాధాన్యత ఇవ్వాలని తాను కోరుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ ఇంచార్జ్ ఛేర్పర్సన్ సారికా రాంమ్మోహన్, పలువురు కౌన్సిలర్లు, పబ్లిక్ హెల్త్ డిఇఇ మల్లేష్, మెఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
• ఫోటోవార్త : అమృత్ పథకానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.