Bogatha waterfall: ప్రకృతి ప్రేమికులను రా..రమ్మంటున్న బొగత జలపాతం.. కానీ బీ అలెర్ట్

Bogatha waterfall: ప్రకృతి ప్రేమికులను రా..రమ్మంటున్న బొగత జలపాతం.. కానీ బీ అలెర్ట్



జలపాతాలు యమలోకానికి దారులవుతున్నాయి. ఆహ్లాదం కోసం వెళ్లే వారి ఆయువు మింగేస్తున్నాయి. రీల్స్ కోసం రిస్క్‌ చేసే వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. మరి మన జలపాతాలు సేఫేనా..? బొగత జలపాతానికి ఆకస్మిక వరదలు సంభవిస్తే... సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ ఎలా ఉన్నాయి.? బొగత జలపాతాల దగ్గర భద్రతపై  అందిస్తున్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్‌ రిపోర్ట్. 


రాళ్లపై పరవళ్లు తొక్కుతున్న జలధార.. ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం ప్రకృతి రమణీయత మధ్య ముగ్ధమనోహరంగా మారింది. హోరెత్తించే జల సవ్వడులతో వెండి వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా బొగత కళకళలాడుతుంది. పాల నురుగులా జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. కొండల నుంచి పరుగున్న వస్తున్న జల సవ్వడిని చూసి తన్మయత్వంలో మునిగిపోతున్నారు.

ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపరలు, జల సవ్వడితో అటవీ ప్రాంతం మనోహరంగా దర్శనమిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నుంచే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా సందర్శకులు వచ్చి తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు. అంత ఎత్తు నుంచి దూకుతుంటే వస్తున్న జలసవ్వళ్లు.. ఆ తుంపరలను చూసి సాంత్వన పొందుతున్నారు సందర్శకులు. కుటుంబసమేతంగా పిల్లాపాలతో వచ్చి.. నిత్యం ఉండే పని ఒత్తిడిని మరిచిపోడానికి బొగత జలపాతాన్ని చూస్తే సరిపోతుందని ఆనందంతో చెబుతున్నారు.


పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు జలపాతం దగ్గర అటవీశాఖ అధికారులు స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. అక్కడ స్నానాలు చేస్తూ పర్యాటకులు జలపాతాన్ని చూస్తూ సందడి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో పరిసరాలు కోలాహాలంగా మారాయి. కొండకోనల్లో నుంచి వడివడిగా పడుతూ నేలను తాకుతున్న జలధారలను చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. అడవి తల్లి ఒడిలో సహపంక్తి భోజనాలు చేసి హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. అలాగే జలపాతాలకు వెళ్లే మార్గంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కట్టడాలు ఆకర్షించుకుంటాయి.. వాచ్ టవర్స్ ఎక్కితే చుట్టూ ప్రకృతి అందాలు, జలసవ్వడులు మనసును దోచుకుంటాయి. మరికొన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.

జలపాతాల వద్దకు జనం పరుగులు పెడుతున్నారు సరే మరి భద్రత మాటెంటీ.? ఈ మధ్యకాలంలో పూణేలో జరిగిన సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేసింది.. ఆ ఘటనలో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో చిక్కుకొని కుటుంబం మొత్తం జల సమాధి అయ్యారు.. అలాంటి వరదలు హఠాత్తుగా వస్తే బొగత జలపాతాలు భద్రమేనా..? ఇక్కడ అలాంటి ప్రమాదాలు సంభవిస్తే ప్రాణాలతో బయటపడవచ్చా…? ఇక్కడ ఎలాంటి భద్రత ప్రమాణాలు ఎలా ఉన్నాయి..? అన్నది కొందరి అనుమానం.

గతంలో ఇక్కడ కూడా అనేక ప్రమాదాలు సంభవించాయి.. సెల్ఫీల కోసం చేసిన రెస్క్యూ పనులు ప్రాణాలు మింగేసిన సందర్భాలు ఉన్నాయి. ఫోటోల కోసం దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో అటవీశాఖ ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఒకేసారి వరద పోటెత్తినా ఆ వరదల్లో ఎవరూ కొట్టుకుపోయే ప్రమాదం లేకుండా ప్రోటక్షన్ వాల్ ఏర్పాటు చేశారు. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా… కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆందోళన కలిగిస్తోంది.

మొత్తంగా ప్రకృతి ప్రేమికులను రారమ్మంటున్న బొగత జలపాతం వద్ద సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డేంజర్ జోన్‌లో గేమ్స్ వద్దు అని హెచ్చరిస్తున్నారు. జలపాతాల వద్ద జాగ్రత్తగా ఉండాలని.. పట్టు తప్పితే ప్రాణాలు పోగొట్టుకుంటారని హితవు చెబుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me