మనుషుల్లోని విలువలని, పరిస్థితులు వెలికితీస్తాయి. బర్రెలక్క (శిరీష) అటువంటి వ్యక్తే. తాను ఒక ఆడపిల్ల, కిందికులాలనుండి.
కానీ అసంకల్పితంగా చేసిన (వీడియో) ఆమెకి అనేక కష్టాలు తెచ్చిపెట్టింది. ఆ కష్టాలు తెగింపుని, ఆ తెగింపు ఒక పోరాటంలోకి నెట్టాయి. అది చివరికి ఎన్నికల్లో నామినేషన్‌కి దారితీసింది.
ఈమెని ఏం చూసి ఎన్నుకోవాలి? నిజమే, చదువురాని, సాటి మనుషుల అవసరాల పట్ల అవగాహనలేని ఎమ్మెల్యేలులేరా? లేక సాటిమనుషులని దోచుకోవడానికి, రాజకీయాల్ని ఒక వ్యాపారంగా మార్చుకున్న ఎమ్మెల్యేలు లేరా? వారితో పోల్చుకుంటే కష్టాలు అనువేకమైన ఒక కిందికులస్తురాలైన ఆడపిల్ల బెటర్ కాదా? కనీసం సమస్యలపట్ల సానుభూతైనా ఆ పిల్లకి వుండదా? రేపు ఎన్నికలయ్యాక ఎవరు ఎంతకు అమ్ముడుపోతారో తెలియదు.
నిజానికి, ఒక్క అసెంబ్లీ సీటుకోల్పోవడం వల్ల అయా రాజకీయ పార్టీ అభిమానులకు పోయేదేమీ లేదు, స్థానిక పోటీదారులైన ముగ్గురు నలుగురు పాతుకుపోయిన ఎమ్మెల్యే పోటీదారులకు తప్ప. కాబట్టి అన్ని పార్టీల అభిమానులూ బయటికి రాలేకపోయినా లోపలి మద్దతునైనా ప్రకటించాలి.
బర్రెలక్కకి ఓటేయడం ఒక ధిక్కారం. అది కులం, డబ్బు, అధికారం, బలిసిపోయినతనం మీద ఒక నిరసన ప్రకటన. అది అన్ని పార్టీల పట్ల సమదూరం. తెలంగాణాకు చెందిన ఒక బహుజనవాదం బలపరచడం. ఒక ప్రజా అవసరాన్ని నొక్కి చెప్పే సందర్భం. రోజూ మాట్లాడుకునే అభ్యుదయాన్ని ఆచరణలో చూపడం.
ఆమెకి అందుతోన్న అన్ని రకాల మద్దతు, ఒక మంచి పనికి దక్కుతోన్న ఆదరణగా గుర్తించాలి. అమెతో నిలిచిన అందరికీ అభినందనలు.
Tags
News@jcl
