తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ సూట్‌కేస్‌లో మానవ శరీర భాగాలు లభించిన కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. మహిళను చంపి శరీర భాగాలతో బిర్యానీ వండినట్లు గుర్తించారు.
రెడ్ కలర్ సూట్‌కేస్‌తో వచ్చిన ఓ పురుషుడు, మహిళ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో దాన్ని బోగీలో ఉంచి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిందితులిద్దరూ లోకల్ ట్రైన్‌లో గూడువాంజేరి చేరుకున్నారు. వారు నివాసముండే ఇంటిని గుర్తించిన పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్.. అతని భార్య భాగమతి మాజిక్‌తో ఉంటున్నాడని, వారితో పాటు హయాత్ నిషా అనే మహిళా ఉంటుందని స్థానికులు తెలిపారు. దీంతో హత్యకు గురైంది నిషాగా పోలీసులు గుర్తించారు.పోలీసులు లస్కర్ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఓ బిర్యానీ పాత్రలో రైస్‌తో పాటు మానవ శరీరం ముక్కలు కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. అంతేకాక ఇల్లంతా రక్తపు మరకలను గుర్తించారు. బిర్యానీ పాత్రను స్వాధీనం చేసుకుని చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హత్యకు గురైన మహిళ తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. లస్కర్ దంపతులు తనకు తమ్ముడు, మరదలు అవుతారని నిషా తమకు స్థానికులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మహిళను హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.