Special Story on Army Village Kuchuru : దేశ సేవ చేయాలనే సంకల్పం ఉంటే పుట్టిన ఊరు కూడా ఆ స్ఫూర్తికి నిలయంగా మారుతుంది. అలాంటి దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని కూచూరు గ్రామం. ఈ గ్రామాన్ని స్థానికంగా 'ఆర్మీ గ్రామం'గా పిలుస్తుంటారు. సుమారు 400కు పైగా కుటుంబాలు, దాదాపు 2 వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామం నుంచి ఇప్పటి వరకు 120 మంది ఆర్మీలో చేరారు. ప్రస్తుతం సుమారు 90 మంది సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని యువత ఉద్యోగాల ఎంపికలో మొదటి ప్రాధాన్యంగా ఆర్మీని ఎంచుకోవడం విశేషం.
యాదయ్యతో మొదలైన స్ఫూర్తి : కూచూరు గ్రామం నుంచి తొలిసారిగా కూచూరు యాదయ్య ఆర్మీలో చేరారు. 1983లో సైన్యంలో చేరిన ఆయన 15 ఏళ్ల పాటు దేశానికి సేవలందించారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసినప్పటికీ యువతకు మార్గదర్శకంగా కొనసాగుతున్నారు. ఆర్మీలో చేరిన వారికి, చేరాలని కలలు కనే యువతకు యాదయ్య ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన చూపిన బాటలోనే గ్రామానికి చెందిన పలువురు యువకులు సైన్యంలో చేరి, దేశ రక్షణలో భాగస్వాములవుతున్నారు.
- ఉద్యోగాల ఎంపికలో మొదటి ప్రాధాన్యం ఆర్మీ
క్రమశిక్షణతో యువత : కూచూరు యువతలో క్రమశిక్షణ, పట్టుదల ఎక్కువగా కనిపిస్తాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రతి రోజూ వ్యాయామం, వాలీబాల్ వంటి క్రీడల్లో పాల్గొంటారు. ఆర్మీ ఎంపికకు అవసరమైన శారీరక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు యువకులు రోజూ సుమారు 6 కిలోమీటర్ల మేర పరుగెడుతుంటారు. ఈ క్రమశిక్షణే వారికి సైనిక ఉద్యోగాల ఎంపికలో ఎంతో ఉపయోగపడుతోంది. ప్రతి ఏడాది గ్రామం నుంచి ఐదారు మంది యువకులు ఆర్మీకి ఎంపికవుతుండటం గ్రామ యువతలో ఉన్న సైనిక స్ఫూర్తికి నిదర్శనం.
తల్లిదండ్రుల ప్రోత్సాహం : యువత ఆర్మీలో చేరేందుకు తల్లిదండ్రుల నుంచి కూడా పూర్తి ప్రోత్సాహం లభిస్తోంది. తమ పిల్లలు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారని వారు గర్వంగా చెబుతున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు దేశానికి సేవ చేసే అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో పిల్లలు సైన్యంలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారు.
దేశభక్తి మరింత పెరుగుతుంది : తాను ఆర్మీ జవానుగా 15 ఏళ్లు సేవలందించి ఉద్యోగ విరమణ పొందానని కూచూరు యాదయ్య తెలిపారు. ప్రస్తుతం యువతకు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తున్నానని చెప్పారు. సైనికుడైతే దేశభక్తి మరింత పెంపొందుతుందని, యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా దేశసేవకు పాటుపడాలని పేర్కొన్నారు.
సదుపాయాల కోసం ఎదురు చూపులు : గ్రామం నుంచి ఇంతమంది సైనికులు దేశానికి సేవలందిస్తున్నప్పటికీ కూచూరులో యువతకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని గ్రామస్థులు చెబుతున్నారు. తనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని, తన కుమారుడు ఆర్మీలో పని చేస్తుండటం గర్వంగా ఉందని కృష్ణయ్య తెలిపారు. యువత కోసం ప్రత్యేక మైదానం, శిక్షకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు.
దేశభక్తి, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగుతున్న కూచూరు యువత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది. సరైన సదుపాయాలు అందితే ఈ గ్రామం నుంచి మరింత మంది యువకులు సైన్యంలో చేరి దేశ సేవ చేసే అవకాశం ఉందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.
దేశభక్తి సేవలో తరిస్తున్న చిన్నకొడప్గల్ యువత - ఇప్పటివరకు 20 మంది సైన్యంలోకి
ఆర్మీలో చేరినందుకు గర్వంపడుతున్నా : గంగారాం అనే జవాను 2014లో ఆర్మీలో చేరారు. తన కంటే ముందుగా ఆర్మీలో చేరినవారిని ఆదర్శంగా తీసుకుని సైన్యంలోకి వచ్చారు. ప్రస్తుతం అతను పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంటి వద్దే పోటీ పరీక్షకు సన్నమద్ధమయ్యాడు. దేశానికి తనవంతుగా సేవ చేయటం గర్వంగా ఉందని అంటున్నారు.
మిత్రులను ఆదర్శంగా తీసుకొని ఆర్మీలోకి : 'మా గ్రామంలో చాలామంది యువకులు సైన్యంలోకి వెళ్లారు. దేశసేవలో మునిగిపోయారు. నేను కూడా వారిలాగే దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకు తగినట్టుగా పరీక్షలకు సన్నద్ధమయ్యాను. అలా నేను ఆర్మీలో చేరాను. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాను' అని బాల్‌రాజ్ పేర్కొన్నారు.
ఇంటి వద్ద సాధన చేసి సైన్యంలోకి : ఆర్మీలో చేరాలని నాకు ఎప్పటినుంచో కోరిక. దానిని సాధించేందుకు పట్టుదలతో కష్టపడి చదివాను. శారీరక పరీక్షల కోసం ఇంటి దగ్గరనే బాగా శ్రమించి సాధన చేశాను. అలా అన్ని పరీక్షల్లో ఎంపికై జవానుగా చేరాను. ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్నాను'అని ప్రశాంత్ తెలిపారు.