పాలమూరు జిల్లాలో ఇసుక దొంగతనం కలకలం రేపుతోంది. సీజ్ చేసిన ఇసుక డంప్ ను వేలానికి సిద్ధమైన ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు ఇద్దరు వ్యక్తులు. వేలానికి ఒకరోజు ముందే ఇసుకను మాయం చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
సీజ్ చేసిన ఇసుక డంప్‌నే సాండ్ మాఫియా మాయం చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వేలానికి ముందు రోజే ఇసుకను తరలించడంతో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 19న దుందుభి వాగు సమీపంలోని పట్టా భూమిలో అక్రమంగా డంప్ చేసిన 15,829 క్యూబిక్ మీటర్ల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన ఇసుకను జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశాలతో వేలం వేయాలని ప్రయత్నాలు చేశారు. ఈ నెల 20న వేలం వేయాలని నిర్ణయించారు.
అయితే వేలం నిర్వహించడానికి ముందు రాత్రికి రాత్రే డంప్‌లోని కొంత ఇసుకను తరలించగా.. మిగతాది ఆనవాళ్లు లేకుండా చేశారు. మిగిలిన ఇసుక డంప్‌ను చదును చేసి, దానిపై మట్టిని కప్పి ఆనవాళ్లు లేకుండా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో భూ యజమానులు చంద్రశేఖర్, బాలకృష్ణారెడ్డి పేర్లు అధికారులు ప్రస్తావిస్తున్నారు.
ఇసుక మాయంపై భూగర్భ శాఖలకు చెందిన అధికారులు సర్వే నంబర్ 96లో జప్తు చేసిన ఇసుక నిల్వ ఉన్న ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ అంశంపై అధికారులు పంచనామా నిర్వహించి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఇసుక తవ్వకాల నిబంధనలు–2015 ప్రకారం సంబంధిత పట్టాదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంబంధిత వ్యక్తుల నుంచి వివరణలు స్వీకరించిన అనంతరం, నిబంధనల ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
సీజ్ చేసిన ఇసుకను అక్రమంగా తరలించడంతో ప్రభుత్వానికి రూ.79 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు మిడ్జిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీజ్ చేసిన ప్రభుత్వ ఆస్తి ఎలా మాయమైంది? ఇంత భారీ మొత్తంలో ఇసుక తరలింపునకు ఎవరు సహకరించారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సీజ్ చేసిన ఇసుకకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? వేలానికి ముందే ఇసుక మాయం కావడంపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
