పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య… భర్త ఇంటి ముందు బిడ్డల ఖననం
- పిల్లలతో కలిసి రెండ్రోజుల క్రితం తల్లి ఆత్మహత్య
- భర్త వేధింపులే కారణమని బంధువుల ఆగ్రహం
వరంగల్ / నర్సంపేట: భర్త వేధింపుల కారణంగా ఇద్దరు కొడుకులతో సహా భార్య ఆత్మహత్య చేసుకోగా, ఆగ్రహించిన గ్రామస్తులు భర్త ఇంటి ముందే బిడ్డలను ఖననం చేయడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
తండాకు చెందిన ప్రవీణ్, స్రవంతి తన ఇద్దరు కొడుకులు కార్తీక్ (10), కౌశిక్ (8)తో కలిసి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసముంటున్నారు. ప్రవీణ్ తన బంధువైన ఓ యువతిని రెండో పెళ్లి చేసుకుని స్రవంతిని వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె తన ఇద్దరు కొడుకులతో కలిసి మంగళవారం రాత్రి మియాపూర్‌లో ఆత్మహత్య చేసుకుంది.
బుధవారం రాత్రి ముగ్గురి మృతదేహాలను గ్రామానికి తరలించారు. ప్రవీణ్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న స్రవంతి బంధువులు, గ్రామస్తులు అతడి ఇంటి ముందే అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అయినా పట్టువదలని కుటుంబసభ్యులు కార్తీక్, కౌశిక్ మృతదేహాలను ప్రవీణ్ ఇంటి ముందే ఖననం చేశారు. స్రవంతి మృతదేహానికి అతడి పంటపొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.