మూడు విడతల్లో రూ.9 వేల కోట్లుతొలిదఫా రూ.3,590 కోట్లు
నర్మెటలో విడుదల చేయనున్న సీఎం
హైదరాబాద్: ఎకరానికి రూ.6 వేల చొప్పున 1.50 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థికశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ కర్మాగారం ప్రారంభోత్సవం రోజున జరిగే సభలో సీఎం మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. ఆ రోజున 73 లక్షల మంది ఒక ఎకరం వరకు రైతులకు రూ.3,590 కోట్లు జమవుతాయి. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్ల నిధులు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా రూ.2,760 నిధులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతుభరోసా నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం.. మరోసారి రైతు పక్షపాతిగా నిరూపించుకుందని వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించింది. తాజాగా విడుదలైతే నాలుగో సీజన్‌కు నిధులు అందుతాయి. ప్రభుత్వం 2023-24 యాసంగిలో ఎకరానికి రూ.5000 చొప్పున 7625 కోట్లు, 2024-25 యాసంగిలో రూ.5000 చొప్పున రూ.5057 కోట్లు, 2025-26 వానాకాలం సీజన్‌లో ఎకరానికి సాయం రూ.6000కి పెంచి రూ.8800 కోట్లను జమ చేసింది. ఈ ఏడాది మొత్తం 73 లక్షల మంది రైతులకు రూ.8881 కోట్ల నిధులు అవసరమని వ్యవసాయశాఖ నివేదించగా.. వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం రూ.9,000 కోట్ల విడుదలకు అంగీకరించింది.
రైతుల సమక్షంలో..
రాష్ట్రంలో ప్రస్తుతం యాసంగి సీజన్ నడుస్తుండగా.. మరో రెండు నెలల్లో వానాకాలం కానుంది. పెట్టుబడి సాయం కింద ఈ నిధులను రైతులు ఉపయోగించుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. నర్మెటలో ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని 22న సీఎం ప్రారంభించనున్నారు. దీంతోపాటు రూ.40 కోట్లతో నిర్మించే నూనె ఉత్పత్తుల తయారీ రిఫైనరీకి శంకుస్థాపన జరగనుంది. అక్కడే వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుభరోసా విడుదలకు ఇదే సరైన వేదిక అని భావించి.. దానికి అనుగుణంగా సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది