No title


 

ACB: ఏసీబీ వలలో భారీ తిమింగలం!
అధికారులకు చిక్కిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌
రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారమే రూ.12.72 కోట్ల ఆస్తుల గుర్తింపు
బహిరంగ మార్కెట్‌లో రూ.వందల కోట్లుంటుందని అంచనా

హైదరాబాద్‌: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు ఖరీదైన తిమింగలం చిక్కింది. రవాణాశాఖలో పనిచేస్తూ అక్రమార్జనలో ఆరితేరిన రవాణాశాఖ మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీటీసీ) మూడ్‌ కిషన్‌ను ఏసీబీ పట్టుకుంది. సికింద్రాబాద్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లి రాజరాజేశ్వరి నగర్‌లోని కిషన్‌ ఇంటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 11 ప్రాంతాల్లో ఏసీబీ హైదరాబాద్‌ రేంజి-2 డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలోని బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించి నగదు, నగలతోపాటు అక్రమాస్తుల కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో మొత్తం రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు లభ్యమయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి. ఆ మధ్య నీటిపారుదలశాఖ ఇంజినీర్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినా, వాటన్నిటి కంటే కిషన్‌   ఆస్తిపాస్తులే అధికమని అంచనా. మంగళవారం సోదాలు ముగిసిన అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్‌ను అరెస్టు చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

బంధువు ఇంట్లో పత్రాలు.. పాట్‌ మార్కెట్‌లో ఆభరణాలు

సోదాల సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయమే బోయిన్‌పల్లిలోని కిషన్‌ ఇంటి తలుపు తట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆ సమయంలో కిషన్‌ కొంతసేపు స్నానాల గదిలోనే ఉండిపోయారు. ఆయన బయటికి వచ్చాక సోదాలు ప్రారంభించగా.. ఆస్తుల పత్రాలేవీ లభ్యం కాకపోవడంతో ఏసీబీ అధికారులకు అనుమానమొచ్చి లోతుగా ఆరా తీశారు. కిషన్‌ సెల్‌ఫోన్‌లో బంగారు ఆభరణాలకు సంబంధించిన ఓ పత్రం లభ్యమైంది. అది సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని ఓ దుకాణానిది కావడంతో విచారించారు. కిషన్‌ ముందు రోజే బంగారు ఆభరణాల్ని తన దుకాణానికి తెచ్చి అప్పగించారని ఆ వ్యాపారి చెప్పడంతో ఏసీబీ అధికారులు వాటిని తెప్పించారు. అలాగే ముందు రోజు రాత్రే ఓ బంధువు ఇంటికి వెళ్లి ఆస్తుల పత్రాలను అప్పగించినట్లు విచారణలో తేలడంతో వాటినీ తెప్పించి స్వాధీనం చేసుకున్నారు.

ఆది నుంచే అక్రమాలు..

1994లో అసిస్టెంట్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా రవాణాశాఖలో అడుగుపెట్టిన కిషన్‌పై ఆదినుంచీ ఆరోపణలున్నాయి. బోధన్‌లో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. అక్కడే మద్నూర్‌లో చెక్‌పోస్ట్‌ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్‌లోనూ ఎంవీఐగా పనిచేశారు. తాజా సోదాల్లో నిజామాబాద్‌లోనూ అక్రమాస్తులు బహిర్గతం కావడంతో తొలినాళ్లలోనే వాటిని కూడబెట్టినట్లు బహిర్గతమైంది. అనంతరం మేడ్చల్, మెహిదీపట్నం ఆర్టీవోగా పనిచేసి పదోన్నతి పొందిన కిషన్‌.. ఏడాది కిందటే మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌గా వెళ్లారు. 

ఏసీబీ గుర్తించిన కిషన్‌ ఆస్తుల చిట్టా..

  • నిజామాబాద్‌లోని ఒక ప్రముఖ లగ్జరీ హోటల్‌లో 50 శాతం వాటా.
  • నిజామాబాద్‌లో ప్రముఖ ఫర్నిచర్‌ దుకాణం నడుస్తున్న 3 వేల చ.గ. స్థలం కిషన్‌దే.
  • నిజామాబాద్‌లోని అశోకా టౌన్‌షిప్‌లో 2 ఫ్లాట్లు.
  • సంగారెడ్డి జిల్లా నిజాంపేట రెవెన్యూ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి. నిజాంపేట మండలంలో 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్‌.
  • నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 ఎకరాల వాణిజ్యస్థలం.
  • రూ.1.37 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌.
  • కిలో బంగారు ఆభరణాలు.
  • హోండా సిటీ కారు.. ఇన్నోవా క్రిస్టా కారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow