కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు?


 కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ కు కష్టాలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. న్యూ ఇయర్ లో గులాబీ పార్టీ నేతలను మూడు ప్రధానమైన కేసులు ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అవినీతి కేసుల్లో విచారణలు షురూ కానున్నాయి.. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు టి.హరీశ్ రావు, కేటీఆర్ ను విచారించేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసు కూడా జనవరిలో స్పీడప్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లోపు కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను విచారించేందుకు కేంద్ర హోం శాఖ నుంచి క్లియరెన్స్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

సంక్రాంతి తర్వాత విచారణ పర్వం

సంక్రాంతి పండగ తర్వాత ఆయా కేసుల్లో వరుస విచారణలు మొదలుకానుంది. ఓ కేసు తర్వాత మరో కేసులో కీలక నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు విచారణలను ఎదుర్కోక తప్పదని ప్రచారం జరుగుతున్నది. సరిగ్గా అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో పార్టీ కేడర్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్సీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసు విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తున్నది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసును విచారిస్తున్న సిట్ ఆఫీసర్ల టీమ్ ముందుగా హరీశ్ రావు, కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసులో ఎవరిని ఎప్పుడు పిలవాలనే అంశంపై ఓ క్యాలెండర్ ను సైతం ఎంక్వయిరీ టీం రెడీ చేసినట్లు చర్చ నడుస్తోంది.

వరుస విచారణలు

ఫార్ములా ఈ రేసు కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను విచారించేందుకు అనుమతివ్వాలని సుమారు నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ లేఖపై మరింత సమాచారం తెప్పించుకున్న కేంద్ర హోం శాఖ పరిధిలోని డీవోపీటీ(డైరెక్టరేట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) అధికారులు జనవరిలో అర్వింద్ ను విచారించేందుకు క్లియరెన్స్ ఇచ్చే చాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో అర్వింద్ కుమార్ ను విచారించిన తర్వాత ఏసీబీ ఆ వెంటనే ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ పై చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత వెనువెంటనే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు సీబీఐ సైతం జనవరి తర్వాత రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని స్పష్టమవుతున్నది. ఈ కేసును విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు లో చోటుచేసుకున్న అక్రమాల కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావును కేంద్ర విచారణ సంస్థ విచారణకు పిలవనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడే ఎందుకు?

అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లీడర్ల అక్రమాలపై విచారణలు జరిపి జైలుకు పంపుతామని కాంగ్రెస్ లీడర్లు పలుసార్లు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా గులాబీ లీడర్ల అక్రమాలపై విచారణలు ఎప్పుడనే ప్రశ్నలు కార్యకర్తల నుంచి సైతం వస్తున్నాయి. అయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఇదే సరైన సమయమని కేడర్ చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో యాక్షన్ తీసుకుంటే ప్రజల్లో ప్రతిపక్ష పార్టీకి పెద్దగా సానుభూతి వచ్చే అవకాశం ఉండదని, కానీ ఆలస్యం చేస్తే మాత్రం అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని చర్చ జరుగుతున్నది. ఈ కేసుల విచారణ ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాలి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow