గ్రామాలే దేశానికి పునాదులు..చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు


 తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని కేవలం రాష్ట్రానికే కాకుండా, దేశానికే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన ఆకాంక్షించారు. బుధవారం నారాయణపేట జిల్లా కొస్గిలో పర్యటించిన ఆయన, ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌లను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ.. గ్రామ స్వరాజ్యం, గ్రామీణాభివృద్ధిపై తనకున్న స్పష్టమైన విజన్‌ను పంచుకున్నారు.

మహాత్మా గాంధీ చెప్పినట్లుగా దేశ పునాదులు గ్రామాల్లోనే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘నిజమైన పాలన అంటే కేవలం అధికార పీఠంపై కూర్చోవడం కాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిట్టచివరి నిరుపేదకు అందినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్య పాలన అనిపించుకుంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. కొడంగల్‌ను ఆదర్శంగా నిలబెట్టడంలో కృషి చేసిన నాయకులను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

అందుబాటులో తిరుపతి రెడ్డి.. మౌలిక వసతులే లక్ష్యం

నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి తన సోదరుడు తిరుపతి రెడ్డి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాకు రోడ్ల సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గుడి, బడి, తాగునీరు వంటి కనీస వసతులతో పాటు, అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తామని వివరించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేసి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు.

వివక్ష లేని అభివృద్ధి.. నేరుగా పంచాయతీలకు నిధులు

రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ‘వేరే పార్టీ నుంచి గెలిచారనే వివక్ష ఎక్కడా చూపించకూడదు. చిన్న చిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టి గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌లు పని చేయాలి’ అని హితవు పలికారు. ఇదే క్రమంలో పంచాయతీలకు నిధుల విడుదలపై కీలక ప్రకటన చేశారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (SDF) నుంచి చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ. 10 లక్షల చొప్పున త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో సంబంధం లేకుండా నేరుగా ప్రతి పంచాయతీకి నిధులు అందేలా చూస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుని, ప్రజా సేవలో నిమగ్నం కావాలని నూతన సర్పంచ్‌లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow