పాలమూరు ఎంతకాలం బలి కావాలి?


 పాలక రాజకీయ క్రీడలకు పాలమూరు ఎంత కాలం బలి కావాలి? మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రులకు పాలమూరు అధ్యయన వేదిక వేస్తున్న సూటి ప్రశ్న ఇది. చాలా కాలం తరువాత బీఆర్ఎస్ అధ్యక్షుడు తమ పార్టీ ఆఫీసుకు వస్తే తెలంగాణకు అది ప్రముఖ వార్త అయిపోయింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఆయన డిసెంబర్ 21న తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీటింగ్ జరిపారు. నిన్ననే కేసీఆర్ ప్రెస్ మీటింగ్‌కి ప్రతి స్పందనగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ముచ్చట జరిపారు.

తొమ్మిది సంవత్సరాల పాలనలో ఏమి పనులు చేయవలసి ఉండినదో, ప్రజలు ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నారో పట్టకుండా మాజీ ముఖ్యమంత్రి అనేక ప్రశ్నలు అడిగారు. అలాగే ఈ రెండేళ్లుగా పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ తప్పులను ప్రశ్నించారు. ఇద్దరి మీడియా సంభాషణలను అలా ఉంచి చూస్తే దీని వల్ల మహబూబ్‌నగర్ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. జిల్లాకు గత ఏడు దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం అత్యవసరంగా గుర్తించి చర్యలు తీసుకోవాలి.

ఎనిమిదేండ్లు గడిచినా ప్రాజెక్టు పెండింగే...

2014 జూన్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పథకం లక్ష్యాలను దారి మళ్లించి దిగువన శ్రీశైలం ప్రాజెక్టు లోకి మార్చి 2015 జూన్ 11న శంకుస్థాపన చేశారు. మూడేళ్ల కాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టును ఎనిమిది ఏండ్లు గడిచినా పూర్తి చేయలేదు. ఇంతే కాక 2015 జూన్ 12న నల్లగొండ జిల్లాలో దిండి లిఫ్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పథకం లాంటి ఒక ప్రతిపాదన లేకుండా, దానిపై ఒక చర్చ లేకుండా కేసీఆర్ ఎందుకు శంకుస్థాపన చేశారో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. ఈ తప్పుడు పథకాన్ని తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పథకానికి జోడించి తీరని నష్టం చేశాడు. దిండి లిఫ్ట్‌లో రిజర్వాయర్‌లు, కాలువల పనులను వేగవంతం చేశారు. ఎందుకు పాలమూరు లిఫ్ట్‌కు అన్యాయం చేశారో ఒక్కసారి కూడా నిజం చెప్పలేదు.

పాలమూరుపై విచారణ ఏది?

ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పథకాన్ని సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. కాళేశ్వరం లిఫ్ట్ పనులతోపాటు పాలమూరు పనుల మీద ఎందుకు విచారణ జరపలేదు? మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం చేసే విధంగా ఆవే పనులు ఎందుకు కొనసాగిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి పనులు వదిలేసి దిండి లిఫ్ట్ పనులు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి కదా. దిండి లిఫ్ట్ పనులు చేస్తుంటే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు చేస్తున్నారు. దిండి లిఫ్ట్‌ను నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకునే విధంగా చేపట్టి ఉంటే ఇప్పుడు దిండి లిఫ్ట్ పేరుతో వేలాది ఎకరాల పేద రైతుల భూములు, గ్రామాలను ముంపు బారి నుండి కాపాడేందుకు అవకాశం ఉండేది.

దిండి లింఫ్ట్ నిజాలు బయటపెట్టరేం?

ఒకరిని ఒకరు ముఖ్య మంత్రులు తిట్టిపోసుకుంటున్నారు కానీ దిండి లిఫ్ట్ కు సంబంధించి ఎవరూ నిజాలు బయటకు చెప్పడం లేదు. నీటి పారుదల శాఖా మంత్రి కూడా పాలమూరు, దిండిలిఫ్ట్‌కు సంబంధించి నిజాలు చెప్పడం లేదు. ఇపుడు నీటి పారుదల శాఖా మంత్రి చెబుతున్న దిండి లిఫ్ట్‌కు, ప్రస్తుతం ఉన్న దిండి ప్రాజెక్టుకు సంబంధం లేదు. వీళ్లు చెబుతున్న దిండి లిఫ్ట్ నీరు Yedula రిజర్వాయర్ నుంచి లేదా Narlapur రిజర్వాయర్ నుంచి, లేదా ఈ దారిలో కాలువ ద్వారా ulpara దగ్గర దుందుభి నదిలోకి చేరి Ulpara రిజర్వాయర్ నుండి ఎడమ కాలువ ద్వారా అంటే దుందుభి నదికి సమాంతరంగా మరో దుందుభి నది లాగా సింగ రాజ పల్లి రిజర్వాయర్‌కి చేరి అటు తర్వాత గోకారం రిజర్వాయర్ నుంచి ఇర్విన్ రిజర్వాయర్‌కి చేరి గొట్టు ముక్క రిజర్వాయర్‌కు పోతాయి. ఈ మొత్తంలో దిండికి, ఆ నీటికి సంబంధం లేదు. ఇవి పూర్తిగా మహబూబ్ నగర్ ప్రజలు తమ హక్కుగా రెండు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న కృష్ణ నీరు. ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఒక్క నీటి పారుదల పథకం కూడా పూర్తి చేయలేక పోయారు. ఉన్న కాలువల నీరు కూడా సాగర్ కాలువల ద్వారా విడుదల చేసే అవకాశాలు లేవు. ఇది కేసీఆర్‌కు, రేవంత్‌కు బాగా తెలుసు.

సమగ్ర జలవిధానం ఆవశ్యం

కృష్ణా నది జలాల పంపిణీలో న్యాయం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు గట్టిగా పోరాటం చేయాలి. బ్రిజేష్ ట్రిబ్యునల్‌లో న్యాయం కోసం సమర్థవంతంగా వాదనలు వినిపించాలి. పరస్పరం విమర్శలు కాక సహకారం ఇచ్చుకోవాలి. రాష్ట్రంలో జిల్లాల మధ్య వైరుధ్యం తలఎత్తకుండా, భూముల ముంపు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం కోసం ఒక సమగ్ర జల విధానం రూపొందించాలి. దీనిలో ప్రజలను, ఇంజనీర్లను భాగం చేయాలి. తెలంగాణ సాగునీటి మంత్రి నల్లగొండ మంత్రిగా కాకుండా రాష్ట్ర మంత్రిగా ఆలోచించాలి. బాధ్యతగా పని చేయాలి. మహబూబ్ నగర్ జిల్లా భూములు ముంచే దిండి లిఫ్ట్ పథకాన్ని రద్దు చేయాలి. మహబూబ్ నగర్ ప్రజలను బజారు పాలు చేయడం తగదు.

ఎం. రాఘవాచారి

కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక

94907 03857

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow