Telangana: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే.. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది..
దగ్గర పడుతున్న హైకోర్ట్ ఇచ్చిన గడువు
వాస్తవానికి, స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యం అయ్యాయి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24 లోపు ఎన్నికల తేదీలపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్, తేదీలను కేబినెట్ ఖరారు చేయవచ్చు. ఈ నిర్ణయాన్ని హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మంత్రుల నుంచి సలహాలు తీసుకుని, అన్ని చట్టపరమైన అంశాలను చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
బీసీ బిల్లుపై ప్రధానంగా చర్చించే చాన్స్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అతిపెద్ద అడ్డంకిగా మారిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. హైకోర్టు గతంలో 42శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో9ని నిలిపివేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోకుండా హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని ఆదేశించింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయడం కష్టమైతే, పార్టీ స్థాయిలో బీసీ అభ్యర్థులకు 42శాతం సీట్లు కేటాయించడం వంటి ప్రత్యామ్నాయాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ, కొత్త సంక్షేమ చర్యలపై చర్చించి, వాటిని వేగవంతం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7న రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన విజయత్సవాలు ప్రణాళికను కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. నిలిచిపోయిన పరిపాలనాపరమైన, అభివృద్ధి ప్రాజెక్టుల ఫైళ్లను ఆమోదించడం. గత కేబినెట్ భేటీలలో చర్చించిన కొన్ని విద్య, మౌలిక వసతుల అంశాలు కూడా ఎజెండాలో ఉండే అవకాశం ఉంది.