కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం తెల్కపల్లి మండలానికి వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి మార్గ మధ్యలో పాలెం గ్రామ సమీపంలో జరిగిన టూ వీలర్ ప్రమాదాన్ని గమనించారు. తక్షణమే వాహనం ఆపి, గాయపడిన వారిని పరిక్షించారు. పరిస్థితి గమనించి వెంటనే తనతో వచ్చిన వాహనంలోనే క్షత గాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులకు సమాచారాన్ని అందించి అత్యవసర చికిత్స ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి పూర్తిగా శ్రద్ధ వహించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే స్పందన స్థానికుల హృదయాలను తాకగా, ప్రజా నాయకుడు ఎలా ఉండాలో ఎమ్మెల్యే చాటి చెప్పారు. ప్రజల కష్ట, సుఖాల్లో పక్కనే ఉండే ఇటువంటి నాయకత్వం జిల్లాలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోందంటూ అభిమానులు ప్రశంసించారు. ప్రజల కోసం ఎప్పుడూ ముందుండే నేతగా, సేవ అనేది పదవికి కాదు మనసుకు సంబంధించినదని మరోసారి ఎమ్మెల్యే నిరూపించారని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కొనియాడారు.
Tags
Telagana